ముంబై, సెప్టెంబర్ 3 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ గురువారం కూడా సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఇంధన ధరలు భగ్గుమంటుండటం, ఐటీ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం చివరి అరగంటలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలకు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 350 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 417.49 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పతనం చెంది 23,873.45 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ప్రారంభంలో లాభపడిన సూచీలు.. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ పెట్టుబడిదారులు అప్రమత్తతకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. సూచీల్లో టైటాన్, ట్రెంట్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మాస్యూటికల్స్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 1.57 శాతం ఎగబాకి 97.13 డాలర్లకు చేరుకోవడం మదుపర్లలో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.