ముంబై, సెప్టెంబర్ 11: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మునుపెన్నడూ లేనివిధంగా 88.35 స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో చూస్తే 24 పైసలు క్షీణించింది. భారత్-అమెరికాల మధ్య టారిఫ్‌ల అంశం.. రూపీపై గట్టిగానే ప్రభావం చూపినట్టు నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు ఫారెక్స్ ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గతకొద్ది రోజులుగా పెరుగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి నెలకొన్నదని కూడా పేర్కొంటున్నారు. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు భారీగా డిమాండ్ కనిపించింది.
ఈ క్రమంలోనే ఒకానొక దశలో 88.49కి రూపీ వాల్యూ పతనమైంది. అయితే చివరకు తిరిగి కోలుకున్నది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సత్ఫలితాలనిచ్చే దిశగానే సాగుతున్నట్టు తెలిపారు. అయినప్పటికీ వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు, ఆ దేశ ద్రవ్యోల్బణం గణాంకాలు, ట్రంప్ సర్కారు ఆయా దేశాలపై వేస్తున్న ప్రతీకార సుంకాలు.. డాలర్ విలువ స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలవన్న అంచనాలైతే ఉన్నాయి.
కాగా, రూపాయి విలువ ఇంకా పతనమైతే.. అది దేశ ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీయడం ఖాయమనే చెప్పవచ్చు. దిగుమతులు భారమై, ద్రవ్యోల్బణం విజృంభించి, ఆర్బీఐ కఠిన ద్రవ్యవిధానాలతో దేశ జీడీపీ వృద్ధిరేటు మందగమనంలోకి జారుకునే వీలున్నది. అందుకే ఆర్బీఐ జోక్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ దాదాపు 3 రూపాయల మేర కోల్పోవడం గమనార్హం.