ముంబై, ఏప్రిల్ 1 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకూ దిగజారిపోతున్నది. సోమవారమైతే తొలిసారి 95 మార్కును దాటిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో 100 స్థాయికి పతనం కావచ్చన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తుండటం గమనార్హం. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగితే భారతీయ కరెన్సీ నష్టాలు ఇంకా పెరుగుతాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటున్నది. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ గురిపెడుతున్నది. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల్లోని చమురు ఉత్పాదక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నది. దీంతో ఆయా దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి తీవ్రంగా ఆటంకం ఏర్పడుతున్నది. ఇది అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. పైగా హొర్ముజ్ జలసంధిపైనా ఇరాన్ ఆంక్షలుండటంతో ఆ మార్గం ద్వారా జరిగే సరుకు రవాణాకు బ్రేకులు పడుతున్నాయి. ఇక దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా గల్ఫ్ దేశాలదే. ఇదే ఇప్పుడు రూపాయి కష్టాలకు కారణమవుతున్నది. ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో మిడిల్ ఈస్ట్ దేశాల వాటా 30 శాతంపైనే. దీంతో అక్కడ నెలకొన్న అశాంతి వల్ల డిమాండ్‌కు తగ్గ చమురు నిల్వలు గ్లోబల్ మార్కెట్లోకి రాలేకపోతున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. దీంతో భారతీయ దిగుమతిదారుల నుంచి డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి బలహీనపడుతున్నదని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
డాలర్ ముందు రూపాయి మారకం విలువ బలహీనపడుతున్నకొద్దీ.. భారతీయుల జేబులకు చిల్లులే. ఇంటి బడ్జెట్ తలకిందులే. ప్రస్తుతం రూపీ విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్థికపరంగా ప్రతి వ్యక్తిపై ఏ రకంగా ప్రభావం పడుతున్నదో ఒక్కసారి పరిశీలిస్తే..
విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే ప్రతి వస్తూత్పత్తి ధరనూ రూపాయి విలువ ప్రభావితం చేస్తుంది. రూపాయి విలువ పతనమైతే వంటనూనెలతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలు, ప్రయాణ ఖర్చులు అన్నీ పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది. చివరకు ఇది వ్యక్తుల ఆదాయాన్ని ప్రభావితం చేయగలదు. వినియోగం, కొనుగోలు సామర్థ్యాలు మందగించి.. దేశ ఆర్థిక వ్యవస్థల్నే పతనావస్థకు నెట్టగలవు.
రూపాయి విలువ క్షీణిస్తున్నప్పుడు పై చదువులు చదువాలన్నా.. విదేశాలకు ప్రయాణించాలన్నా కష్టమే. విదేశాల్లో డాలర్ల కోసం మరింత ఎక్కువగా భారత్ నుంచి రూపాయిలను పంపించాల్సి ఉంటుంది. దీంతో విదేశాల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఇది పెద్ద దెబ్బే. అలాగే విదేశీ పర్యటనల వ్యయం కూడా అమాంతం పెరిగిపోగలదు.

రూపాయి విలువ పతనంతో దిగుమతయ్యే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్లు తదితర ఎలక్ట్రానిక్స్ అన్నింటి ధరలూ కొండెక్కుతాయి. అలాగే విదేశాల నుంచి వచ్చే ఆయా ఔషధాల్లో వాడే ముడి పదార్థాలకూ అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వివిధ ఔషధాల ధరలు పెరుగుతాయి. వైద్యం ఖర్చులు భారంగా మారుతాయి.
డాలర్లు లేదా ఇతర బలమైన విదేశీ కరెన్సీల్లో రుణాలు ఖరీదెక్కుతాయి. వీటి ఈఎంఐలను చెల్లించడం మరింత భారంగా మారగలదు. అలాగే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ధరలను అదుపులోకి తెచ్చేందుకు రెపోరేటును పెంచుతుంది. దీనివల్ల బ్యాంకుల్లో రుణాలపైనా వడ్డీరేట్లు పెరుగుతాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలన్నీ ప్రియమవుతాయి.

విదేశీ ఉద్యోగులు భారత్‌కు పంపించే సొమ్ము విలువ పెరుగుతుంది. దీనివల్ల రెమిటెన్సులు పెరుగుతాయి. అలాగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టినవారికి రాబడులు పెరుగుతాయి. కంపెనీలకు ఆదాయం కూడా పెరుగుతుంది. దేశంలో ఆయా వ్యాపారాలు, పెట్టుబడులకూ ఇది ఉత్సాహాన్నిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.