హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగంగా ఉంటూ ఉపాధి, ఆదాయాలపరంగా పెద్దదైన కోళ్ల పెంపకం పరిశ్రమ.. పెను సమస్యలను ఎదురొంటోందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), పౌల్ట్రీ పరిశోధన డైరెక్టరేట్ (డీపీఆర్) అధ్యయనంలో వెల్లడైంది. వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు, వైద్య సిబ్బంది కొరత ఉందని, టీకాలు తగినన్ని అందుబాటులో లేవని గుర్తించింది. గుడ్లు, చికెన్ ధరలలో అస్థిరత్వం ఈ రంగం ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారినట్టు డీపీఆర్ తాజా నివేదికను విడుదల చేసింది.
దేశీయంగా కోళ్లు, గుడ్ల ఉత్పత్తి, మాంసం లభ్యతలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని డీపీఆర్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇక్కడ 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొంది. దేశంలోని కోళ్లలో రాష్ట్రంలోనే 9.39 శాతం ఉన్నాయి. రోజుకు 1,397.2 టన్నుల చికెన్ ఉత్పత్తి అవుతుండగా.. సగటున 5.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నట్టు తేలింది. అయితే వాణిజ్య కోళ్ల పెంపకం ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ విధానాలతో కొనసాగుతుండగా.. నాటుకోళ్ల పెంపకం అసంఘటితంగా ఉన్నట్టు వెల్లడించింది. నిర్వహణలోనూ సంరక్షణ, మారెటింగ్ సమస్యలు ఎదురవుతున్నట్టు అధ్యయనం గుర్తించింది. రాష్ట్రంలో దాణా, పోషక విలువల పరిశీలన, పోషకాహార లోపాన్ని గుర్తించడానికి అవసరమైన ప్రయోగశాలలు సైతం అందుబాటులో లేవన్నది.
నాటుకోళ్ల ఉత్పత్తి లాభదాయకమైనప్పటికీ వాటి సంరక్షణ సమస్యగా మారింది. వీటిని పెంచే ప్రాంతాలలో కుకలు, పిల్లులు, ఇతరత్రా జంతువుల వల్ల రైతులు పెంపకానికి వెనకాడుతున్నారు. పైగా వీటి గుడ్ల నిల్వకు శీతల గిడ్డంగుల సౌకర్యం లేక పెంపకందారులు ఎప్పటికప్పుడు వాటిని విక్రయిస్తున్నారు. అలాగే మొకజొన్న, సోయా వంటి దాణా ధరలు పెరగడంతో పెంపకం భారంగా మారింది. మార్కెట్ సైతం లాభసాటిగా లేదని వాపోతున్నారు. ఈ సవాళ్లను అధిగమించి, స్థిరమైన వృద్ధిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పౌల్టీ ఇండస్ట్రీకి తగినంత ప్రోత్సాహకాలు ఇవ్వాలని డీపీఆర్ శాస్త్రవేత్తలు రాజ్‌కుమార్, విజయ్‌కుమార్‌లు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.