హైదరాబాద్, ఏప్రిల్ 4: దేశీయ ఔషధ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 28.29 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.64 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం భారత ఔషధాల ఎగుమతి, ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ కే రాజభాను తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 5.6 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. ‘అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి రాణిస్తున్న అతికొద్ది రంగాల్లో ఔషధాల ఎగుమతి కూడా ఒకటి. ఫార్ములేషన్లు, బయోలాజికల్స్, వ్యాక్సిన్లు, ఆయుష్ ఉత్పత్తులు భారత ఫార్మా ఇండస్ట్రీకి కలిసొస్తున్నాయి’ అని ఇక్కడ జరిగిన ‘చింతన్ శిబిర్: విస్తరిస్తున్న ఔషధ ఎగుమతులు’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భాను అన్నారు.
కాగా, 2024-25లో భారతీయ ఔషధ రంగ ఎగుమతులు 9.4 శాతం వృద్ధితో 30.47 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.84 లక్షల కోట్లు)గా ఉన్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో ధరల ఒత్తిళ్లు, వాణిజ్యపరమైన ఒడిదుడుకులు ఎదురైనా ఆకర్షణీయ స్థాయిలో ఎగుమతులు పెరిగాయని వివరించారు. ఈ నేపథ్యంలో 2025-26లో అంతకుమించి ఎగుమతులే నమోదవుతాయన్న ఆశాభావాన్ని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి వ్యక్తం చేశారు. మార్చి గణాంకాలు త్వరలోనే వస్తాయన్నారు.
ప్రస్తుతం ఇంచుమించుగా 60 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.6 లక్షల కోట్లు)గా ఉన్న భారతీయ ఔషధ రంగ పరిశ్రమ విలువ.. 2030 నాటికి 130 బిలియన్ డాలర్ల (రూ.12.11 లక్షల కోట్లకుపైగా)కు చేరవచ్చని రాజభాను అంచనా వేశారు. విదేశాల్లో భారతీయ ఔషధాలకు, ముఖ్యంగా జనరిక్ ఔషధాలకు భారీగా గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోల్చితే మన ఔషధాలు తక్కువ ధరకు లభించడం, సమర్థవంతంగా పనిచేస్తుండటమే ఈ డిమాండ్‌కు కారణం. అమెరికాలో మెజారిటీ ప్రజలు భారత్ నుంచి వచ్చే జనరిక్ ఔషధాలనే వాడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే 4-5 ఏండ్లలో భారతీయ ఔషధ పరిశ్రమ విలువ రెట్టింపునకుపైగా పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఫార్మెక్సిల్ వెలిబుచ్చుతున్నది.
కాగా, 2030 నాటికి దేశీయ వార్షిక ఔషధ ఎగుమతులు 65 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లకుపైగా)కు చేర్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు ఈ సందర్భంగా భాను తెలియజేశారు. సంప్రదాయ మార్కెట్లను దాటుకొని కొత్త మార్కెట్లను అన్వేషించడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెంపు, ప్రభావవంతమైన రెగ్యులేటరీ విధానాలతో ఇది సాధ్యమేనన్నారు. ఇక ఔషధాల ఉత్పత్తిలో వాల్యూమ్‌పరంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు భాను చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా మార్కెట్లకు దేశీయ ఔషధాలు వెళ్తున్నట్టు వివరించారు. ఇందులో అమెరికా వంటి అత్యంత రెగ్యులేటరీ మార్కెట్లకే 60 శాతం ఎగుమతులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. అమెరికా వాటా 34 శాతంగా ఉంటే, యూరప్ వాటా 19 శాతమని తెలిపారు. దీన్నిబట్టి భారతీయ ఔషధాల ప్రామాణికత ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు కొనసాగితే.. భారతీయ ఎగుమతులకు తిప్పలు తప్పవని కేంద్ర వాణిజ్య కార్యదర్వి రాజేశ్ అగర్వాల్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకింత ఆందోళన కనబర్చారు. భారత్ నుంచి ఇతర దేశాలకు రవాణా కష్టతరంగా, వ్యయభరితంగా మారుతుందని తెలిపారు. భారత్‌కు పశ్చిమాసియా మార్కెట్ కూడా కీలకమేనని, ఎగుమతుల్లో 12-13 శాతం ఇక్కడికే వెళ్తాయన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలతో ఆ మార్గం గుండా సరుకు రవాణా ప్రమాదకరంగా మారుతున్నదన్నారు. అయితే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలకు పడిపోతుండటం దేశీయ ఎగుమతులకు కలిసొస్తున్నదని, ఇది ఔషధ రంగ ఎగుమతుల విలువను పెంచుతున్నదని అగర్వాల్ అంటున్నారు.