న్యూఢిల్లీ, జనవరి 21 : దేశీయ ఐటీ దిగ్గజాలు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన సంస్థల జాబితాలో ఐదు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాలు ఉన్నాయని బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా టాప్-10 విలువైన సంస్థల్లో అమెరికా ఎప్పటిలాగే 40 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. 36 శాతం వాటాతో భారత్ ఆ తర్వాతి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. యూఎస్ టెక్నాలజీ దిగ్గజం యాక్సెంచర్ వరుసగా ఏడోసారి అత్యంత విలువైన సంస్థగా తన స్థానాన్ని కొనసాగించింది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 21.3 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ(11 శాతం ఎగబాకింది)తో రెండో స్థానం దక్కించుకున్నది. వరుసగా నాలుగో సారి ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మరోవైపు, 2025లో అత్యంతవేగవంతమైన ఐటీ సర్వీసుల బ్రాండ్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీ అవతరించిందని పేర్కొంది.
గడిచిన ఐదేండ్లుగా తొలిస్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ను వెనక్కినెట్టి హెచ్‌సీఎల్ ఈ స్థానాన్ని దక్కించుకున్నదని బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తం ఐటీ విలువల్లో 36 శాతం వాటాతో భారత్ రెండోస్థానంలో కొనసాగుతున్నది. గత కొన్నేండ్లుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన అమెరికా మార్కెట్ తిరిగి పుంజుకోవడం దేశీయ ఐటీ సంస్థలకు కలిసొచ్చిందని, ముఖ్యంగా నూతన ఆర్డర్లు రావడంతో దేశీయ ఐటీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. మూడోస్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం ఎగబాకి 16.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇదే స్థానంలో కొనసాగడం వరుసగా నాలుగోసారి. ఇన్ఫోసిస్ సీఈవో పరేఖ్ నాయకత్వంలో సంస్థ అన్ని విభాగాల్లో రాణిస్తున్నదని, పనితీరు మెరుగుపడటంతోపాటు ఇన్నోవేషన్‌లో దూసుకుపోతున్నదని పేర్కొంది. అలాగే హెచ్‌సీఎల్ టెక్నాలజీ బ్రాండ్ విలువ 17 శాతం ఎగబాకి 8.9 బిలియన్ డాలర్లకు చేరుకోగా, విప్రో విలువ 6 బిలియన్ డాలర్లుకాగా, టెక్ మహీంద్రా కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. అలాగే టాప్-25 గ్లోబల్ ర్యాకింగ్ సంస్థల్లో తొలిసారిగా హెక్సావేర్ టెక్నాలజీ ప్రవేశించింది.