ముంబై, సెప్టెంబర్ 15: భారతీయ ఫారెక్స్ రిజర్వులు ఈ నెల తొలి వారంలో 4.992 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో సెప్టెంబర్ 8 నాటికి 593.904 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. అంతకుముందు వారం 4.039 బిలియన్ డాలర్లు పెరిగి 598.897 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే సెప్టెంబర్ మొదలు తగ్గుముఖం పట్టాయి.
కాగా, 2021 అక్టోబర్‌లో దేశీయ ఫారెక్స్ రిజర్వ్‌లు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదిలావుంటే ఫారెక్స్ రిజర్వ్‌ల్లో బంగారం నిల్వలు 554 మిలియన్ డాలర్ల మేర పడిపోయి 44.384 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ తాజా వివరాల్లో వెల్లడించింది. ఫారిన్ కరెన్సీ ఆస్తులు 4.265 బిలియన్ డాలర్లు దిగజారి 526.426 బిలియన్ డాలర్లకు వచ్చాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా 134 మిలియన్ డాలర్లు దిగి 18.06 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్ద సైతం భారత్ రిజర్వ్ పొజీషన్ 39 మిలియన్ డాలర్లు కుచించుకుపోయి 5.034 బిలియన్ డాలర్లకు వచ్చింది. అయితే ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ నష్టపోతున్న నేపథ్యంలో దేశీయ ఫారెక్స్ రిజర్వ్‌లపై ఆ ప్రభావం పడుతున్నది. రూపాయిని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ డాలర్లను వినియోగించాల్సి వస్తున్నది. అలాగే దేశీయ ఎగుమతులు అంతంతమాత్రంగా ఉండటం కూడా డాలర్ల రాకను అడ్డుకుంటున్నది. దీంతో ఫారెక్స్ రిజర్వ్‌ల్లో తగ్గుదల తప్పట్లేదన్న విశ్లేషణలున్నాయి.