Bank A/C wirh Video KYC | మీరు కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలనుకుంటున్నారా.. అయితే, బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ తెరవొచ్చు. అందుకు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ టెక్నాలజీ సాయంతో మీకు ఆ వసతి కల్పిస్తోంది. వీడియో ద్వారా కేవైసీ పత్రాలు సమర్పిస్తే చాలు.. మీ ఖాతాను తెరిచేస్తుంది. ‘వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (వీసీఐపీ)’ టెక్నాలజీ సాయంతో ఖాతాలను ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ తెలిపింది.
దీంతో కస్టమర్లు ఖాతా తెరవడానికి తమ శాఖకు రావాల్సిన అవసరం ఉండదని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. వీడియో ద్వారా కేవైసీ పత్రాలు సమర్పించడం పూర్తయ్యాక ఏటీఎం కార్డు, బ్యాంక్ ఖాతా చెక్‌బుక్ మీ అడ్రస్‌కు వచ్చేస్తాయని వివరించింది. ఖాతాను తెరవడానికి జమ చేయాల్సిన కనీస మొత్తం కూడా ఆన్లైన్లోనే పంపవచ్చునని పేర్కొంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక నిరంతర మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. మున్ముందు దశలవారీగా ఇతర సేవలకు ఈ వసతిని విస్తరిస్తామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. అయితే, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవాలనుకునేవారు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోవాలి. కెమెరా, మైక్రోఫోన్ ఆప్షన్లు గల కంప్యూటర్ ద్వారా బ్యాంక్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.