ముంబై, జూన్ 26 : దేశీయ విమానయాన సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేటట్టులేదు. ఒకవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బక్కచిక్కుతుండటం, మరోవైపు విమాన ఇంధనం రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం, నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు కావడం, రెంటల్స్ లీజు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థలు రూ.36 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు నష్టం రావచ్చునని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. గతంలో రూ.12 వేల కోట్ల స్థాయిలో ఉండొచ్చని అంచనావేసిన ఇక్రా..ఈసారికిగాను మూడింతలు పెంచింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమనడం, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ బలపడటం కారణంగా విమానయాన సంస్థల నష్టాలు మరింత పెరుగడానికి ప్రధాన కారణాలని విశ్లేషించింది. దేశీయ విమానయాన సంస్థల్లో లోడ్ కెపాసిటీ తారుమారు అవుతున్నది. ఒక నెలలో తగ్గితే..మరో నెలలో పెరుగుతున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని పేర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ రూట్లలో పలు విమాన సర్వీసులు రద్దు కావడం ఇందుకు కారణమన్నది. దీనికి తోడు గరిష్ఠ స్థాయిలో టికెట్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమాన ప్రయాణికులపై సంస్థలు చార్జీల భారం మోపడం కూడా ప్రయాణాలను వాయిదావేసుకుంటున్నారని తెలిపింది. 2025-26లోనూ విమాన సంస్థలు రూ.17-18 వేల కోట్ల నష్టం రావచ్చునని అంచనావేయగా..తీరా చూస్తే వీటి నష్టాలు రెండింతలు పెరిగి రూ.32-34 వేల కోట్లకు చేరుకున్నాయి. విదేశీ ఎక్సేంజ్ నష్టాలు తీవ్రతరం కావడంతోపాటు రూపాయి క్షీణత, ప్రయాణికుల రద్దీలో వృద్ధి మందగించడం, ఏటీఎఫ్ ధరలు అధికమవడం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలని తెలిపింది.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు భారీ స్థాయిలో రద్దు అయ్యాయి. ప్రస్తుత నెలలో విమాన ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేకపోయినప్పటికీ, కిందటేడాదితో పోలిస్తే మాత్రం 26.9 శాతం అధికమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో దేశీయ విమాన ప్రయాణికులు 11.3 శాతం ఎగబాకి 1.56 కోట్లకు చేరుకున్నారు. కిందటేడాది ఇదే నెలలో 1.40 కోట్ల మంది ప్రయాణించారు. వీటికి పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.