హైదరాబాద్, ఫిబ్రవరి 2: ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 69 శాతం తగ్గి రూ.11.78 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇది రూ.38.08 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.144 కోట్ల నుంచి రూ.142.63 కోట్లకు తగ్గింది.
నిర్వహణ ఖర్చులు 3.50 శాతం పెరిగి రూ.140.86 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించారు. ముడి సరుకుల ధరలు 42 శాతం పెరగడం, ఉద్యోగుల ప్రయోజనాల 28 శాతం పెరగడం కూడా లాభాలపై ప్రభావం చూపాయి. కంపెనీ షేరు ధర 6.35 శాతం తగ్గి రూ.670 వద్ద నిలిచింది.