India-UK Trade Deal | ఇక సుంకాలు నిల్.. అమల్లోకి భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) బుధవారం అమల్లోకి వచ్చింది. దీంతో బ్రిటన్‌కు భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఇకపై దాదాపు 99 శాతం వస్తూత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు లేదా తక్కువ భారం పడనున్నది.
- తెలంగాణ నుంచి యూకేకు సరుకు రవాణా మొదలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) బుధవారం అమల్లోకి వచ్చింది. దీంతో బ్రిటన్‌కు భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఇకపై దాదాపు 99 శాతం వస్తూత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు లేదా తక్కువ భారం పడనున్నది. అలాగే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే 90 శాతం వస్తూత్పత్తుల విషయంలోనూ ఇదే వర్తించనున్నది. కాగా, సీఈటీఏతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, సేవా రంగాలు బలోపేతమవడమేగాక, పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులకూ అవకాశాలుంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ముఖ్యంగా ఆటోమోటివ్, తయారీ, కన్జ్యూమర్ గూడ్స్, క్రియేటివ్ ఇండస్ట్రీస్, మెడికల్ టెక్నాలజీ రంగాలకు ప్రోత్సాహం లభిస్తుందని వాణిజ్య, వర్తక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎగుమతులకు ఊతం
సీఈటీఏతో ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆశాభావం వ్యక్తం చేశారు. సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) కార్యాలయంలో తెలంగాణ నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడంతో రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని కూడా అన్నారు.
మార్కెటింగ్‌కు అవకాశం
భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం.. విస్తృత శ్రేణి ఉత్పత్తులకు పన్ను రాయితీలను కల్పిస్తుందని విదేశీ వాణిజ్య విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ డా సంపత్ కుమార్ అన్నారు. ప్రధానంగా బ్రిటన్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల అమ్మకాలకు, వాటి ఎగుమతులకు అవకాశాలను గణనీయంగా పెంచగలదని చెప్పారు. అలాగే విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ భవానీ శ్రీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో లభించే ప్రయోజనాలు చిన్న పరిశ్రమలకు పెద్దగా అందుతాయని పేర్కొన్నారు. ఫార్మా, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో తెలంగాణ ఇప్పటికే బలంగా ఉన్నందున.. ఈ ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరింత ముందంజలో నిలువగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. అపెడా తెలంగాణ, ఏపీ ప్రాంతీయ అధిపతి ఆర్పీ నాయుడు మాట్లాడుతూ..
వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులు, మిఠాయిలు, చిరుధాన్యాలు సహా అపెడా పరిధిలోని ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఒప్పందం గొప్ప అవకాశాలను అందిస్తుందని వివరించారు. యూకే హై కమిషనర్ టేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏను ఒక చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు. మెరుగైన మార్కెట్ ప్రవేశం, సులువైన డాక్యుమెంటేషన్ ద్వారా ఇది వాణిజ్యాన్ని సులభతరం చేస్తుందని, తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ ఐసీడీ అసిస్టెంట్ కస్టమ్స్ కమిషనర్ వంశీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, నిజామాబాద్‌లోనూ బ్రిటన్‌కు సరుకుల ఎగుమతి ప్రారంభ కార్యక్రమం జరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

