న్యూఢిల్లీ, ఆగస్టు 15 : దేశీయ టాబ్లెట్ పీసీ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్నది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పీసీ మార్కెట్ 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నదని, దీంట్లో మూడోవంతు పీసీలు యాపిల్ కంపెనీకి చెందినవే అమ్ముడుకావడం విశేషమని సైబర్‌మీడియా రీసర్చ్ తన నివేదికలో వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో యాపిల్‌కు చెందిన ఐపాడ్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 10 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది.
దేశీయ టాబ్లెట్ మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ తన తొలి స్థానాన్ని నిలపెట్టుకున్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఐపాడ్ 11 సిరీస్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన రావడం ఇందుకు కారణమని తెలిపింది. యాపిల్ మొత్తం విక్రయాల్లో ఈ ఐపాడ్ వాటా 70 శాతంగా ఉన్నది. దేశీయ టాబ్లెట్ మార్కెట్ రూపాంతరం చెందుతున్నదని, ముఖ్యంగా 5జీతో నడిచే టాబ్లెట్లకు డిమాండ్ అధికంగా ఉంటుందని అంచనాను విడుదల చేసింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంది.
ప్రీమియం టాబ్లెట్లకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉన్నది. యాపిల్, సామ్సంగ్ వంటి సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ రెండు సంస్థలు తొలి వరుసలో నిలిచాయి.