న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : గడిచిన కొన్నేండ్ల నుంచి స్మార్ట్ఫోన్ తయారీలో చిరునామాగా ఎదుగాలని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)వంటి వాటినీ ఆయా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ప్రస్తుత గల్ఫ్ సంక్షోభం.. భారత్ ఆశల్ని ఆవిరి చేసేలా ఉన్నదని నికీ ఏషియా నివేదిక ఒకటి హెచ్చరిస్తున్నదిప్పుడు.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య వైరం.. ట్రంప్ పరస్పర సుంకాలు, తదనంతర పరిణామాలతో పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే అనేక విదేశీ సంస్థలకు తయారీ కేంద్రంగా భారత్ కనిపిస్తున్నది. ఇందుకు తగ్గట్టే ఆయా కంపెనీలను ఆకర్షించేందుకు వివిధ ప్రోత్సాహకాలను కేంద్రం అందిస్తున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోల్చితే 55 శాతం ఎక్కువ. అయితే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఆ మార్గం గుండా జరిగే ఎగుమతి-దిగుమతుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ వాణిజ్యాన్ని ప్రమాదంలో పడేసింది. ఇప్పటికే ఆయా దేశాలకు ఎగుమతులు తగ్గిపోగా.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో భారత్ నుంచి 22-25 శాతం స్మార్ట్ఫోన్ల ఎగుమతులు వచ్చే వారాల్లో పడిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న యాపి ల్ ఐఫోన్లలో సుమారు 25 శాతం భారత్లో తయారైనవేనని బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తున్నది. గతంతో పోల్చితే 53 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. గత ఏడాది భారత్లో దాదాపు 55 మిలియన్ల ఐఫోన్లను యాపిల్ అసెంబుల్డ్ చేసింది. 2024లో ఇవి 36 మిలియన్లే. 2025లో మొత్తంగా 220 నుంచి 230 మిలియన్ల ఐఫోన్లను యాపిల్ తయారుచేసింది. అయితే యుద్ధంతో భారత్ నుంచి ఆయా దేశాలకు ఐఫోన్ల ఎగుమతి కష్టతరంగా మారుతున్నది. చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో భారత్లో తయారైన ఐఫోన్ల రేట్లను పెంచితేగానీ గిట్టుబాటు అయ్యేలా లేదు. గల్ఫ్ ఉద్రిక్తతలు తగ్గకపోతే భారత్లో ఐఫోన్ల తయారీని యాపిల్ తగ్గించుకోవచ్చన్న విశ్లేషణలున్నాయి.