హైదరాబాద్, జూలై 17: దేశవ్యాప్తంగా ప్రతి భాషలో ప్రతి ఒక్కరికీ సమగ్ర సమాచారాన్ని అందించడానికి భాషపరమైన అంతరాలను తగ్గించే ఏఐ-ఆధారిత పరిష్కారాలను అమలు చేసే దిశగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఏఐ/ఎంఎల్ ఆధారిత సాంకేతిక పరిష్కారాల కోసం కృషి చేస్తున్న ఇంక్యూబేటర్లు, స్టార్టప్‌లతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించడానికి ప్రధాని తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ వేదికను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భవిష్యత్తు సన్నద్ధంగా ఉండే అత్యాధునిక డిజిటల్ వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన కళా సేతు, భాషా సేతు పోటీలను ఈ వేదిక ద్వారా ప్రారంభించినట్టు చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు https:// wavex. wavesbazaar.comలో దరఖాస్తు చేసుకోవాల్సివుంటుందని తెలిపింది.