Dhanteras | బంగారం, వెండి ధరలు దిగి రావడంతో ధంతేరాస్ సందర్భంగా కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి. గత నెల 28న తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63 వేలకు చేరువై.. రూ.800-1500 మధ్య దిగి వచ్చాయి. ధంతేరాస్ నాడు బంగారం కొనుగోలు చేస్తే తమ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భారతీయుల విశ్వాసం. బంగారంతోపాటు హోం అప్లియెన్సెస్ కొనుగోలు చేస్తుంటారు. ధరలు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధంతేరాస్ కొనుగోళ్లు పెరుగుతాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. దేశ రాజధానిలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 తగ్గి రూ. 60,950 పలికింది. గతేడాది అంటే 2022 ధంతేరాస్ సందర్భంగా తులం బంగారం ధర (24 క్యారట్స్) ధర రూ.50,139 పలికింది. వీటికి పన్నులు అదనం. 2022 ధంతేరాస్ నుంచి ఇప్పటి వరకూ తులం బంగారం ధర రూ.10, 811 పెరిగింది.
సాధారణంగా ధంతేరాస్ నాడు సుమారు 20-30 టన్నుల బంగారం విక్రయాలు జరుగుతుంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నుంచి అర్థరాత్రి పొద్దుపోయే వరకూ బంగారం కొనుగోళ్లు సాగుతాయని బులియన్ వ్యాపారులు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 12.35 గంటలకు ధంతేరాస్ ముహూర్తం ప్రారంభమై శనివారం (నవంబర్ 11) మధ్యాహ్నం 1.57 గంటల వరకూ ఉంటుంది. ఈ కాలంలో బంగారం కొనుగోళ్లు జరిపేందుకు సరైన ముహూర్తం అని పంచాంగ కర్తలు చెబుతున్నారు.
గతేడాది నుంచి బంగారంపై పెట్టుబడులు దాదాపు 20 శాతం రిటర్న్స్ ఇచ్చాయని యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దేవేయ గాగ్లానీ చెప్పారు. ‘ప్రస్తుతం బంగారం ధరలు సానుకూలంగా ఉన్నాయి. కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రమంగా విక్రయాలు పెరుగుతాయి’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ పీటీఐకి చెప్పారు.