Ban on China Phones | చౌకధరలో స్మార్ట్ ఫోన్లు అంటే గుర్తుకు వచ్చేవి షియమో.. రెడ్మీ.. రియల్మీ.. వివో వంటి కంపెనీలే. ఇవి చైనా కేంద్రంగా పని చేసే మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు. రూ.12 వేల లోపు (150 డాలర్లు) ధర గల చౌక ఫోన్ల క్రయ, విక్రయాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరనున్నది. అదే జరిగితే షియోమీ సహా చైనా మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజాలు భారత్ మార్కెట్లో వాటా కోల్పోక తప్పకపోవచ్చు. రియల్మీ, ట్రాన్సియన్ వంటి సంస్థల ఫోన్లు ఎక్కువగా భారత్‌లో అమ్ముడవుతున్నాయి. దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థల విక్రయాలు పడిపోవడం దీనికి కారణంగా కనిపిస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి.
కేంద్రం గనుక నిషేధించడానికి నిర్ణయం తీసుకుంటే.. ఎంట్రీ లెవెల్ ఫోన్ల మార్కెట్లో షియోమీ, ఇతర డ్రాగన్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు వాటా కోల్పోవడం ఖాయం. కరోనా లాక్డౌన్ వేళ భారత్‌లో చైనా మొబైల్ ఫోన్ల విక్రయాలు పెరిగిపోయాయి. జూన్ త్రైమాసికంలో రూ.12 వేల లోపు విలువ గల స్మార్ట్ ఫోన్ల విక్రయాలు మూడొంతులు ఉన్నాయి. కౌంటర్ పాయింట్ అనాలసిస్ ప్రకారం చైనా కంపెనీలు 80 శాతం ఫోన్లు భారత్‌కు తీసుకొస్తున్నాయి.
ఇప్పటికే షియోమీ, ఒప్పో, వివో వంటి చైనా మొబైల్ సంస్థల కార్యాలయాలపై ఇటీవల దర్యాప్తు సంస్థలు దాడులు చేసి తనిఖీలు చేపట్టాయి. ఆయా సంస్థలు పన్ను ఎగవేతతోపాటు హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు ఈ సోదాల్లో తేలింది. ఇప్పటికైతే చైనా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడానికి అధికారిక ఆదేశాలేమీ లేవు. ఆపిల్ ఐఫోన్, శ్యామ్‌సంగ్ వంటి సంస్థల మొబైల్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో వాటిపై అధికారుల కన్ను పడలేదు.
కేంద్రం నిషేధం విధిస్తుందని వచ్చిన వార్తలపై స్పందించడానికి షియోమీ, రియల్ మీ, ట్రాన్సియన్ ప్రతినిధులు ముందుకు రాలేదు. కేంద్ర టెలికం శాఖ అధికారులు కూడా స్పందించలేదు.