న్యూఢిల్లీ, మార్చి 8: ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2023 జనవరి-మార్చి, క్యూ4) దేశ ఆర్థిక వ్యవస్థ 4 శాతం వృద్ధి రేటును మాత్రమే సాధించగలుగుతుందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతంలోపునకు పడిపోతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 2022-23 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 13.2 శాతం వృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థ రేటు ద్వితీయ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) 6.3 శాతానికి, మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) 4.4 శాతానికి దిగజారిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుత క్యూ4లో మరింత తగ్గుతుందని ఇండియా రేటింగ్స్ అనలిస్ట్ పరాస్ జెస్రానీ వివరించారు.
ఈ ఫిబ్రవరి 28న ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు అంచనాల ప్రకారం పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. దీనిని అందుకోవాలంటే, ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2021-22లో 9.1 వృద్ధి సాధించినట్టు ప్రభుత్వం ఇటీవల అంచనాల్ని ఎగువముఖంగా సవరించింది. దీంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది వృద్ధికి పెద్ద దెబ్బ తగిలినట్టే. క్యూ4లో త్రైమాసికంలో జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) 5.1 శాతం వృద్ధిని అంచనా వేసింది. అయితే కొవిడ్ తదుపరి ఏర్పడిన డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ వృద్ధి మాంద్యంతో ఎగుమతులు క్షీణించడం తదితర రిస్క్‌ల కారణంగా ప్రభుత్వ అంచనాలు నెరవేరవని ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది.
ఈ ఏడాది మార్చి-మే మధ్యకాలంలో దేశవ్యాప్తంగా తీవ్రమైన వేడి గాలులు వ్యాపించవచ్చంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వ్యవసాయ దిగుబడి తగ్గవచ్చని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి గ్రామీణ డిమాండ్ దెబ్బతింటుందని రేటింగ్ ఏజెన్సీ అనలిస్ట్ పరాస్ జెస్రానీ తెలిపారు. క్యూ4లో వ్యవసాయ రంగం వృద్ధి 4.3 శాతం ఉంటుందని ఎన్ఎస్వో అంచనా వేసింది. మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గిందని, జనవరి నెలలో డబ్బుకు ఉన్న నికర డిమాండ్‌తో పోలిస్తే లిక్విడిటీ నాలుగు నెలల కనిష్ఠస్థాయి 0.43 శాతానికి తగ్గిందని, 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతమని పేర్కొంది. ఈ అంశం సైతం జీడీపీ వృద్ధి తగ్గవచ్చనడానికి సంకేతమేనని ఇండియా రేటింగ్స్ తెలిపింది.
వరుసగా రెండో న్లైన జనవరిలో ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం క్షీణించి 32.91 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 3.6 శాతం తగ్గుదలతో 50.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఇండియా రేటింగ్స్ గుర్తుచేసింది. ఇవి ఇంతగా క్షీణించడం గత 25 నెలల్లో ఇదే తొలిసారని తెలిపింది. సానుకూల అంశమేమిటంటే సర్వీసుల విభాగంలో వాణిజ్య మిగులు జనవరి నెలలో ఏడాది క్రితంతో పోలిస్తే 8.39 బిలియన్ డాలర్ల నుంచి 16.48 బిలియన్ డాలర్లకు రెట్టింపు అయ్యింది. దీంతో మొత్తంగా వాణిజ్య లోటు (సర్వీసులు, ఉత్పత్తులు కలుపుకొని) 1.26 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. 2022 జనవరిలో ఈ లోటు 8.95 బిలియన్ డాలర్లుగా ఉంది.