న్యూఢిల్లీ, అక్టోబర్ 11: చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రతీకార సుంకాలను విధించడంతో తన పొరుగు దేశమైన భారత్‌కు లాభం చేకూరనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఉత్పత్తులపై అమెరికా మరో 100 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో మొత్తం పనున 130 శాతానికి చేరుకోనున్నది.
దీంతో దేశీయ ఎగుమతులు పుంజుకోవడంతోపాటు ఎగిమతిదారులకు లాభం చేకూరనున్నదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 86 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా సుంకం పెంపునకు వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నది.
అమెరికా రక్షణ, ఈవీలు, క్లీన్-ఎనర్జీ ఇండస్ట్రిస్లలో ఈ ఖనిజాలను వినియోగించనున్నారు. ప్రస్తుతం దేశీయ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌ను విధిస్తుండగా, అలాగే చైనా ఉత్పత్తులపై 30 శాతం విధిస్తున్నది. దీనికి అదనంగా నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా టారిఫ్‌ను 100 శాతం అదనంగా విధించబోతున్నది. బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా మాట్లాడుతూ..చైనా ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనుండటంతో దేశీయ ఉత్పత్తి సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయని, కొనుగోలుదారులు తమ ఉత్పత్తులపై ఆసక్తి కనబరిచే అవకాశాలుంటాయన్నారు.
ఇరు దేశాల మధ్య ట్రేడ్‌వార్‌తో ఈవీలతోపాటు విండ్ టర్బైన్లు, సెమికండక్టర్ల విడిభాగాల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని జీటీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పాదరక్షలు, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెళ్లపై అత్యధికంగా ఆధారపడుతున్నది అమెరికానే. దేశీయ ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుండగా, అలాగే దిగుమతుల వాటా 6.22 శాతంగా ఉన్నది.