న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత్ దిగుమతులకు ప్రధానంగా చైనా పైనే ఆధారపడుతున్నది. ఈ కారణంగా ఆ దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చైనా దిగుమతులు 4.16 శాతం వృద్ధిచెంది 98.51 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 77.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఈ లోటు 72.9 బిలియన్ డాలర్లు. భారత్ నుంచి చైనాకు జరిగే ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నందున ఆ దేశంతో వాణిజ్యలోటు భారీగానే ఉంటున్నది. అలాగే కీలకమైన ముడి పదార్థాలు, పరికరాల కోసం దేశీ సంస్థలు చైనా వైపే చూడాల్సి వస్తున్నది. ‘దేశంలో వివిధ రంగాల్లో ఉత్పత్తి జరుగుతున్నా, ప్రతీ చిన్న విడిభాగాన్ని సొంతంగా తయారు చేయలేకపోతున్నాం. దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది’ అని కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పుకొచ్చారు.
భారత్కు జరిగే దిగుమతుల్లో చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 13.79 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఈ వాటా 15.43 శాతం. ఇతర దేశాల నుంచి ఎరువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు జరిగిన కారణంగా చైనా వాటా కొంత తగ్గిందని ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ‘చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మేము కసరత్తు చేస్తున్నాం. దిగుమతి జరిగే ఉత్పతులను ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. దీంతో కొన్ని దేశాలపైనే ఆధారపడటం తగ్గుతుంది’ అని ఆ అధికారి వివరించారు.