Maggi Noodles | పిల్లలకు తక్కువ తయారు చేసే స్నాక్.. టిఫిన్ అంటే గుర్తుకు వచ్చేది ‘మ్యాగీ’.. నెస్లే ఇండియా తయారు చేస్తున్న ఈ ‘మ్యాగీ’ న్యూడిల్స్ వినియోగంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అలాగే నెస్లే మరో ఉత్పత్తి కిట్ క్యాట్ విక్రయాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని నెస్లే ఇండియా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చాలా ఏండ్లుగా మ్యాగీ పేరుతో నెస్లే ఇన్ స్టంట్ నూడిల్స్ విక్రయిస్తోంది. కేవలం రెండే రెండు నిమిషాల్లో తయారయ్యే ఈ నూడిల్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. గత ఆర్థిక సంవత్సరంలో 600 కోట్లకు పైగా మ్యాగీ ప్యాకెట్లు అమ్ముడు పోయాయంటే దానికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో స్థానంలో ఉన్న కిట్ క్యాట్ ఫింగర్స్ 4200 మిలియన్ యూనిట్లు విక్రయించామని నెస్లే తెలిపింది. అయితే, పరిమితికి మించి కొన్ని పదార్థాలు అధికంగా వాడారన్న ఆరోపణలు రావడంతో మ్యాగీపై గతంలో ఐదు నెలల పాటు నిషేధం అమలైంది. అయినా 2015లో తిరిగి భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిషేధానికి గురి కాక ముందు 70 శాతం మార్కెట్ వాటా నెస్లే మ్యాగీ సొంతం. కానీ తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థానాన్ని అందుకోలేకపోయింది. దీనికి కారణం న్యూడిల్స్ తయారీలో ఇతర సంస్థలు ఎంటర్ కావడమే.