న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: టాప్-25 సాయుధ ఎగుమతి దేశాల్లో భారత్ ఎంతోకాలం ఉండబోదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా, మిడిల్ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులే ఇందుకు కారణమని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) చెప్తున్నది. ప్రస్తుతం ఆగ్నేయాసియా, మీడిల్ఈస్ట్, ఆఫ్రికా దేశాలకే భారత్ నుంచి ఎక్కువగా రక్షణ ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆఫ్రికా తమ సాయుధ దిగుమతులను 40 శాతం తగ్గించుకోగా, మిడిల్ఈస్ట్ 8.8 శాతం, ఆగ్నేయాసియా దేశాలు 7.5 శాతం చొప్పున కోత పెట్టాయి. మున్ముందు మరింతగా ఈ ఎగుమతులు పడిపోయే వీలుందని సిప్రి చెప్తున్నది. ఇదే జరిగితే టాప్-25 సాయుధ ఎగుమతి దేశాల జాబితా నుంచి భారత్ వైదొలగక తప్పదని అంటున్నది. సిప్రి నిరుడు విడుదల చేసిన జాబితాలోనే భారత్ 23వ స్థానంలో ఉన్నది మరి