ముంబై, నవంబర్ 5: గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అడ్డాగా హైదరాబాద్, బెంగళూర్ల హవా కొనసాగతున్నది. ఇప్పటికీ దేశంలోని ప్రతీ 10 జీసీసీల్లో 7 సెంటర్ల నాయకత్వం ఈ రెండు నగరాల ఆధారంగానే పనిచేస్తున్నది మరి. ఈ మేరకు బుధవారం క్వెస్ కార్ప్స్ ‘ఇండియాస్ జీసీసీ-ఐటీ టాలెంట్ ట్రెండ్స్ 2025: న్యూ ఎంట్రెంట్స్ షేపింగ్ ఇండియాస్ క్యాపబిలిటీ ఎవల్యూషన్’ పేరిట విడుదలైన నివేదిక తెలియజేసింది. నాయకత్వం దృష్టి ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు వ్యాప్తంగానే ఉంటున్నదని స్పష్టం చేసింది.
సంస్థాగతంగా కొత్త ఉద్యోగులు, సేవలు, సైప్లెల కోసం గత ఏడాదితో పోల్చితే 42 శాతం ఎక్కువగా అభ్యర్థనలు ఈసారి హైదరాబాద్ నుంచి పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. 6-8 శాతం పోటీతత్వ ప్రీమియం ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. నిజానికి దేశవ్యాప్తంగా జీసీసీలను ఆకట్టుకుంటున్న నగరాల్లో హైదరాబాద్‌తోపాటు బెంగళూరు ముందు వరుసలో ఉంటున్నాయని ఎప్పట్నుంచే అనేక సర్వేలు చెప్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజా సర్వే అందుకు మరోసారి అద్దం పట్టింది. ఇదిలావుంటే బెంగళూరు ప్రతిభావంతులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. ఈ క్రమంలోనే మార్కెట్ సగటును మించి ఇక్కడి వ్యయ సూచీ 8-10 శాతం పలుకుతున్నది.
చెన్నై కూడా ఫైనాన్స్, రిస్క్, కంట్రోల్-ఓరియెంటెడ్ వర్క్ కోసం జీసీసీలకు ఓ చక్కని ఎంపికగా ఎదుగుతుండటం గమనార్హం. ఈ కోణంలో దాదాపు 94 శాతం రిటెన్షన్ లెవల్స్‌ను చెన్నై సొంతం చేసుకున్నది. దేశంలోని ప్రథమ శ్రేణి నగరాల్లో ఇదే అత్యధికం. అనలిటిక్స్, క్వాలిటీ అస్యూరెన్స్ల్లో పుణె బలపడుతుండగా.. ద్వితీయ శ్రేణి నగరాల్లో కొచ్చి, కోయంబత్తూర్, అహ్మదాబాద్, ఇండోర్ ముందు వరుసలో ఉన్నాయి. ఇదిలావుంటే ‘ఇండియా న్యూ జీసీసీ టాలెంట్ ట్రెండ్స్ 2025: ఫ్రం కెపాసిటీ టు క్యాపబిలిటీ’ ఆధారంగా మరో రిసెర్చ్ రిపోర్టును కూడా క్వెస్ కార్ప్స్ విడుదల చేసింది. ఇందులో టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కొరత కనిపిస్తున్నట్టు తేలింది.