హైదరాబాద్, జనవరి 8: ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ ప్యాకేజింగ్ కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హర్యానాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద రూ.100 కోట్లతో ఆరంభించింది. ఈ నూతన కేంద్రాల వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు. దీంతోపాటు మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో కొత్తగా 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి భూమిని కొనుగోలు చేసినట్లు మోల్డ్టెక్ సీఎండీ జే లక్ష్మణ రావు తెలిపారు. 2024-25లో కంపెనీ రూ.75-80 కోట్ల మూలధన వ్యయం చేయనుండటంతో వార్షిక తయారీ సామర్థ్యం 54 వేల మెట్రిక్ టన్నులకు చేరుకోనుందన్నారు. ప్రస్తుతం సంస్థ ల్యూబ్స్, పెయింట్స్, ఆహార పదార్థాల కంటైనర్లు తయారు చేస్తున్నది. వచ్చే ఐదు నుంచి ఆరేండ్లకాలంలో కంపెనీ మొత్తం వ్యాపారంలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల వాటా 50 శాతానికి పైగా ఉంటుందని వ్యాఖ్యానించారు.