న్యూఢిల్లీ, డిసెంబర్ 20: నాన్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ చైర్మన్గా రిజర్వుబ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో నియమితులయ్యారు. శుక్రవారం కంపెనీ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. సెంట్రల్ బ్యాంక్, ద్రవ్యపరపతి సమీక్ష, ఫైనాన్షియల్ రెగ్యులేషన్ విభాగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న కనుంగో..2017 నుంచి 2021 వరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు.
ప్రస్తుతం ఆయన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. బోర్డు వ్యూహాత్మక దిశానిర్దేశం, పాలన ప్రమాణాలు మెరుగుపరచడం, వాటాదారులు, వినియోగదారులు, నియంత్రణ సంస్థలు, ఇతర వాటాదారుల ప్రయోజనాలు పరిరక్షించడం ఆయన వల్ల సాధ్యమవుతుందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఎండీ నిర్మల్ జైన్ తెలిపారు.
మరోవైపు, ఏప్రిల్ 1, 2018 నుంచి ఫిబ్రవరి 3, 2025 వరకు ఐటీఆర్-బీ ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని ఐటీ చట్టం-1961లోని సెక్షన్ 158బీసీ కింద మూడు నెలల క్రితం నోటీసు జారీ అయినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.