ICICI Q3 Results | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ నికర లాభాల్లో అదరగొట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నికర లాభాల్లో 25 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. గతేడాది రూ.4,940 కోట్ల నికర లాభాలు గడించగా, ఈ ఏడాది రూ.6,194 కోట్ల మేరకు లాభాలు పొందింది. ఇక నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ)లోనూ 23 శాతం పురోగతి సాధించింది. గతేడాది రూ.9,912 కోట్ల నికర వడ్డీ ఆదాయం సంపాదించుకున్న ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,236 కోట్లకు చేరుకుంది. గతేడాది చివరి మూడో త్రైమాసికంలో 3.67 శాతం నికర వడ్డీ మార్జిన్ పొందింది. గత సెప్టెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ నాలుగు శాతం కాగా, డిసెంబర్ త్రైమాసికంలో 3.97 శాతం వద్ద స్థిర పడింది.
వడ్డీయేతర ఆదాయంలోనూ 25 శాతం పురోగతి రికార్డయింది. 2020-21 మూడో త్రైమాసికంలో రూ.3,921 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.4,899 కోట్లకు దూసుకెళ్లింది. రిటైల్ రుణాలు 19 శాతం పెరిగాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం రుణాలు 61.3 శాతం ఎక్కువయ్యాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం డిపాజిట్లు 16 శాతం పెరిగాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం డిపాజిట్లు రూ.10.17 లక్షల కోట్లకు చేరాయి. సగటున కరంట్ ఖాతా డిపాజిట్లు 34 శాతం, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 25 శాతం పెరిగాయి. టోటల్ టర్మ్ డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.5.36 లక్షల కోట్లకు చేరాయి.