న్యూఢిల్లీ/న్యూయార్క్, జూలై 15 : అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) షేర్లు కుప్పకూలాయి. మంగళవారం ఏకంగా 25 శాతం పడిపోయాయి. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల (రూ.6.7 లక్షల కోట్లు)దాకా ఆవిరైపోయింది. గడిచిన 58 ఏండ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటమే ఈ భీకర నష్టాలకు కారణమని బ్లూంబర్గ్ నివేదిక చెప్తున్నది. 1911లో ప్రారంభమైన ఐబీఎం ఆదాయం.. జూన్‌తో ముగిసిన 3 నెలల్లో ఏమాత్రం అంచనాలను అందుకోకుండా కేవలం 1 శాతం పెరిగి 17.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇది మదుపర్లను పెద్ద ఎత్తున అమ్మకాల దిశగా నడిపించిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
‘క్లయింట్ల ఆలోచనల్ని అంచనా వేయడంలో మేము తడబడ్డాం. మార్కెట్లో చోటుచేసుకున్న మార్పులపట్ల వేగంగా స్పందించలేకపోయాం’ అంటూ ఐబీఎం చైర్మన్, సీఈవో అర్వింద్ కృష్ణ మదుపర్లకు రాసిన ఓ లేఖలో పేర్కొనడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ‘జూన్ నెలలో కొన్ని వారాలు.. క్లయింట్లు తమ త్రైమాసిక మూలధన వ్యయాన్ని సర్వర్లు, స్టోరేజీ, మెమరీ చిప్‌ల కొనుగోలుకు మళ్లించడాన్ని మేము గమనించాం. ధరలు పెరుగవచ్చన్న అంచనాల నడుమ ఈ కొనుగోలుకు దిగారు. అయితే ఈ పరిణామాన్ని మేము ఊహించలేకపోయాం. చివరకు అదే ఐబీఏం ఆదాయానికి గండి కొట్టింది’ అని అన్నారు.
ఈ క్రమంలో అర్వింద్ వ్యాఖ్యలు సైతం మదుపర్లలో మున్ముందు ఐబీఎం వ్యాపార కార్యకలాపాలపై ఆందోళనల్ని రేకెత్తించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు భారీగా కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారని ఎక్సపర్ట్స్ అంటున్నారు. మొత్తానికి కృత్రిమ మేధ (ఏఐ)కు నానాటికీ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఐబీఎం నష్టాలు.. ఇప్పుడు ఇతర టెక్ కంపెనీల ఫలితాలపైనా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఐబీఎం షేర్ విలువ ప్రస్తుతం 220.80 డాలర్లుగా ఉన్నది.