న్యూఢిల్లీ : సెమీకండక్టర్లు, మొబైల్ తయారీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర క్యాబినెట్ రూ. 1.9 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు ప్రోత్సాహకాలను రూపొందించారు. సెమికాన్ 2.0 పథకం కింద సెమీ కండక్టర్ల డిజైన్, తయారీ సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం రూ. 1.27 లక్షల కోట్లు కేటాయించింది.
చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, పరీక్షలు, పరిశోధన, అభివృద్ధి తదితర ఆరు రంగాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. దీని ద్వారా రూ. 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావాలని, రూ.2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 2026 -27 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉండనుంది.