Hyundai | కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద కార్లు, ఎస్యూవీ మోడల్ కార్ల పట్ల మోజు పెంచుకుంటున్నారు. 2021తో పోలిస్తే 2022లో దేశీయ కార్ల విక్రయాల్లో దాదాపు సగం వాటా ఎస్యూవీ కార్లదే. `లాండ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు స్ట్రాంగ్ టార్చ్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ సామర్థ్యం గల ఎస్యూవీ కారు అంటే డీజిల్ వర్షన్ పాపులర్` అని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) తరుణ్ గార్గ్ చెప్పారు. 2022 హ్యుండాయ్ కార్ల సేల్స్‌లో 26 శాతం డీజిల్ వర్షన్ కార్లేనని తరుణ్ గార్గ్ చెప్పారు. ఇది కరోనాకు ముందు పరిస్థితుల్ని తెలియజేస్తున్నది.
ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేకించి కార్ల తయారీలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్‌తోపాటు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ టెక్నాలజీస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ తరుణంలో డీజిల్ వినియోగ కార్లపై ఫోకస్ చేయాలని హ్యుండాయ్ నిర్ణయించడం ఆసక్తికర పరిణామం. దేశీయ కార్ల మార్కెట్లో ప్రత్యేకించి ఎస్‌యూవీల్లో డీజిల్ వర్షన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా సాహసోపేత నిర్ణయం తీసుకున్నది.
కస్టమర్ల నుంచి పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా డీజిల్ టెక్నాలజీ అభివృద్ధిపై పెట్టుబడులు పెంచాలని ప్రణాళిక రూపొందించినట్లు హ్యుండాయ్ మోటార్స్ ప్రకటించింది. హ్యుండాయ్ మార్కెట్లోకి తెచ్చిన న్యూ క్రెటా ఎస్‌యూవీతో డీజిల్ కార్లకు డిమాండ్ పెంచిందని తరుణ్ గార్గ్ గుర్తు చేశారు. 2020లో క్రెటాను మార్కెట్లోకి తెచ్చినప్పటి నుంచి ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. ఇంధన మైలేజీ, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ దృష్ట్యా కస్టమర్లు క్రెటా డీజిల్ మోడల్ వైపు మొగ్గుతుండటం గమనార్హం.
`ఇక ముందు కూడా భారత మార్కెట్‌కు, ప్రత్యేకించి ఎస్‌యూవీలకు డీజిల్ టెక్నాలజీ అనుగుణంగా ఉండనున్నది. కస్టమర్ల ఆకాంక్షలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్లు పెంచడానికి మేం కట్టుబడి ఉన్నాం` తరుణ్ గార్గ్ అన్నారు. భారత కార్ల మార్కెట్లో వాటా పెంచుకోవడానికి డీజిల్‌పై ఫోకస్ చేయాలని హ్యుండాయ్ నిర్ణయించింది. గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20 వంటి పలు పాపులర్ మోడల్స్ దేశంలో గట్టి పట్టు సంపాదించాయి.