Hyundai | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నికర లాభాలు 16 శాతం తగ్గాయి. గత మూడు నెలల్లో దేశీయంగా కార్ల అమ్మకాలు పడిపోవడంతో లాభాలు క్షీణించాయని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో రూ.1,628 కోట్ల నికర లాభాలు గడించిన హ్యుండాయ్ మోటార్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1,375 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16 శాతం తక్కువ. ఆపరేషన్స్ ద్వారా 2023-24 ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం రూ.18,660 కోట్ల నుంచి రూ.17,260 కోట్లకు పరిమితమైందని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన తర్వాత హ్యుండాయ్ మోటార్ ఇండియా ఆర్థిక ఫలితాలు వెల్లడించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభాలు తగ్గిపోవడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో హ్యుండాయ్ షేర్ 0.98 శాతం నష్టంతో రూ.1,931 వద్ద ట్రేడయింది.
జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయంగా 1,49,639 కార్లు విక్రయించగా, విదేశాలకు 42,300 కార్లు ఎగుమతి చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు దేశీయంగా కార్ల విక్రయాలు తగ్గడంతో నికర లాభాలు పడిపోయాయని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్ సూ కిమ్ మీడియాకు చెప్పారు. హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఏడాది క్రితం 2,09,777 కార్లను విక్రయించింది.