Hyundai Exter CNG | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన న్యూ ఎస్యూవీ కారు ఎక్స్టర్ (Exter) ను సీఎన్జీ వర్షన్ లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతో మంగళవారం ఆవిష్కరించింది. న్యూ మోడల్ ఎక్స్టర్ కారును ఎక్స్టర్ హెచ్‌వై – సీఎన్జీ డ్యూ అని పిలుస్తారు. ఇందులో ఒక పెద్ద సిలిండర్‌కు బదులు రెండు చిన్న సీఎన్జీ సిలిండర్లు ఉంటాయి. ఎక్స్టర్ హెచ్‌వై- సీఎన్జీ కారు మూడు వేరియంట్లు – ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ నైట్ ఎడిషన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర రూ.8.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మైక్రో ఎస్యూవీ కారు కోసం ఆసక్తి గల కస్టమర్లు సమీప డీలర్ షిప్ వద్దకు వెళ్లి గానీ, ఆన్ లైన్ లో గానీ బుక్ చేసుకోవచ్చు.
ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ కారు 1.2 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 69 హెచ్‌పీ విద్యుత్, 95.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తోంది. 60 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకుతో వస్తున్న ఈ కారు.. కిలో సీఎన్జీపై 27.1 కి.మీ మైలేజీ ఎఫిషియెన్సీ కలిగి ఉంటుంది. డ్యుయల్ సిలిండర్ వేరియంట్ కస్టమర్లు సింగిల్ ట్యాంక్ వేరియంట్ కూడా ఎంచుకోవచ్చు. సింగిల్ సిలిండర్ గ్యాస్ ట్యాంక్ ఎంచుకున్న వారికి రూ.7,000 ధర తగ్గుతుంది.
ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ కారు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ ప్లే / ఆండ్రాయిడ్ ఆటోతోపాటు 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటాయి. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, టీపీఎంఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, పెట్రోల్ నుంచి సీఎన్జీకి స్మూత్‌గా షిఫ్ట్ కావడానికి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంటుంది.
డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తున్న హ్యుండాయ్ తొలి కారు ఎక్స్ టర్ కానున్నది. త్వరలో హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా సెడాన్ మోడల్ కార్లలోనూ ఈ టెక్నాలజీ రానున్నది. టాటా మోటార్స్ తర్వాత డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ మోడల్ కారు తీసుకొస్తున్న కంపెనీగా హ్యుండాయ్ నిలిచింది. హ్యుండాయ్ మోటార్ ఇండియా ప్రతినిధి తరుణ్ గార్గ్ మాట్లాడుతూ కస్టమర్లకు మార్కెట్లోకి సుస్థిర, ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడానికి కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతో ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ కారును ఆవిష్కరించడానికి ఆసక్తితో ఉన్నాం అని చెప్పారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ కారు రిలయబుల్, ఎఫిషియెంట్ ఆప్షన్‌గా నిలుస్తుందన్నారు.