న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా తన వాహన ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ హెచ్చుతగ్గుదలకు లోనుకావడం, లాజిస్టిక్స్ ఖర్చులు అధికం కావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ డైరెక్టర్, సీవోవో తరుణ్ గార్గ్ వెల్లడించారు. కొత్త మాడల్తోపాటు పాత మాడళ్లకు కూడా ఈ ధరల పెంపు వర్తించనున్నదన్నారు. ప్రస్తుతం సంస్థ రూ.5.92 లక్షల విలువైన గ్రాండ్ఐ10 నియోస్ నుంచి రూ.46.05 లక్షల విలువైన ఎలక్ట్రిక్ వాహనం అయోనిక్ 5 మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.