Hyundai Car Discounts | ఒకవైపు రెండోదశ బీఎస్-6 ప్రమాణాల అమలు.. దాంతో పెరుగుతున్న తయారీ ఖర్చుకు అనుగుణంగా కార్ల ధరల పెంపు.. అయినా ఏప్రిల్ నెలలో కార్ల సేల్స్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించిన దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. మే నెలలో తనకార్ల సేల్స్ పెంచుకోవాలని తలపెట్టింది. అందుకోసం మే నెలలో ఎంపిక చేసిన మోడల్ కార్ల సేల్స్ మీద డిస్కౌంట్లు ప్రకటించింది. ఆ జాబితాలో హ్యుండాయ్ ఐ20, హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుండాయ్ ఔరా, హ్యుండాయ్ కొనా ఎలక్ట్రిక్ మోడల్స్ మీద డిస్కౌంట్లు, భారీ ఆఫర్లు ప్రకటించింది.
హ్యుండాయ్ మోటార్ ఇండియా పరిధిలో పాపులర్ కార్లుగా పేరొందిన హ్యుండాయ్ క్రెటా, హ్యుండాయ్ వెన్యూ, హ్యుండాయ్ అల్కాజర్, హ్యుండాయ్ టస్కన్, హ్యుండాయ్ వెర్నా కార్లపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ప్రకటించలేదు.
హ్యుండాయ్ ఐ20 కారుపై రూ.20 వేల వరకు బెనిఫిట్లు లభిస్తాయి. మ్యాగ్నా, స్పోర్ట్జ్ ట్రిమ్ పై రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్, అదనపు డిస్కౌంట్ (ఎక్స్చేంజ్) రూ.10 వేల రాయితీ లభిస్తుంది. ఐ20 ఎన్ లైన్ వేరియంట్ కారుపై రూ.15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ హ్యుండాయ్ ఐ20 కారు.. మారుతి సుజుకి బాలెనోతో తలపడుతున్నది. హ్యుండాయ్ ఐ20 ధర రూ.7.46 లక్షల నుంచి రూ.11.88 లక్షల మధ్య పలుకుతుంది.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలు చేసిన వారు రూ.38 వేల వరకు రాయితీలు పొందొచ్చు. క్యాష్ బ్యాక్ రూ.25 వేలు, అడిషినల్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 లభిస్తుంది. దీని ధర రూ.5.73 లక్షల నుంచి రూ.8.51 లక్షల మధ్య పలుకుతుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ కారుతో గ్రాండ్ ఐ10 నియోస్ పోటీ పడుతుంది.
హ్యూండాయ్ ఔరా మోడల్ కారుపై రూ.33 వేల వరకు రాయితీ పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 లభిస్తుంది. మొత్తం సీఎన్జీ వేరియంట్లపై రూ.23 వేలకు వరకు రాయితీ పొందొచ్చు. దీని ధర రూ.6.32 లక్షల నుంచి రూ.8.90 లక్షలు పలుకుతుంది. హ్యుండాయ్ ఔరా వేరియంట్.. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ మోడల్ కార్లతో తల పడుతుంది.
హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై గరిష్టంగా క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.50 వేలు రాయితీ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం లేదు. దీని ధర రూ.23.84 లక్షల నుంచి రూ.24.03 లక్షల మధ్య పలుకుతుంది.