హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్‌లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 35 శాతంగా ఉండటం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. ఏటా రూ.50 వేల కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతున్నాయని, వచ్చే ఐదేండ్లలో ఇవి లక్ష కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం కావడంతో వ్యాపారవేత్తలు ఎలాంటి అనుమానాలు, భయాలు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్‌ను నిర్మించి ఈ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రోత్సాహాకాలు అందివ్వనున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్లు, దీంతో గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ఆరోగ్య సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ఐటీ, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికలు దోహదపడతాయన్నారు. లైఫ్ సైన్సెస్‌లో నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక యూనివర్సిటీలు స్థాపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
పల్సస్ గ్రూపు సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ వద్ద ఏఐ ఆధారిత ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ..రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ హెల్త్‌కేర్ హబ్‌తో ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.