హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో ప్రపంచ నగరాలకు ధీటుగా హైదరాబాద్ ఎదుగుతున్నది. నిర్మాణ దశలోని గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌లో ప్రపంచంలోని అన్ని ప్రముఖ నగరాలను దాటి భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచినట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదిక వెల్లడించింది. దీంతో టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలను కూడా వెనక్కినెట్టి మన విశ్వనగర ఐటీ భవిష్యత్తు మరింత ద్విగుణీకృతంగా ఉండనుందనేది తేలిపోయింది. అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరాబాద్ మహా నగరంలో.. నేడు ఐటీ రంగం ప్రపంచస్థాయి ప్రమాణాలతో వృద్ధి చెందుతున్నది.
టాప్ గ్లోబల్ కంపెనీలు తమ క్యాంపస్‌లను నగరంలో ఏర్పాటు చేస్తుండటంతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌కు అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్నది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నిర్వహించిన తాజా సర్వేలో ఇదే స్పష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకంగా 44 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ఉన్నట్టు తేలింది. బెంగళూరులో ఇది 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నది. ఈ విషయంలో ఢిల్లీ మూడో స్థానానికి పరిమితమైంది. టోక్యో, న్యూయార్క్, పారిస్ నగరాలన్నీ ఆ తర్వాతే ఉన్నాయి. అమెజాన్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ వంటి విదేశీ సంస్థలతోపాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి దేశీయ కంపెనీలు బెంగళూరు కంటే ఎక్కువ విస్తీర్ణంలో హైదరాబాద్‌లోనే తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
నిర్మాణ రంగంవైపు ఇతర రంగాలు..
హైదరాబాద్ మహా నగరంలో ఆఫీస్ స్పేస్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఫార్మా కంపెనీలు సైతం నిర్మాణ రంగంలోకి దిగుతున్నాయి. కేవలం ఐటీనే కాదు.. దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కంపెనీలు కూడా తమ ప్రధాన క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పుడు మొగ్గు చూపుతున్నాయి మరి. ఈ క్రమంలోనే హెటీరో, అరబిందో వంటి కంపెనీలు ఇప్పటికే ఆఫీస్ స్పేస్ నిర్మాణాలను ప్రారంభించాయి.
ప్రధానంగా కోకాపేట కేంద్రంగా దూసుకుపోతున్న ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏకంగా 75 ఎకరాల్లో ఎనిమిది టవర్స్‌ను కేవలం ఆఫీస్ స్పేస్‌కే కేటాయించడం విశేషం. గతంలో నాస్కామ్ విడుదల చేసిన జీసీసీ (గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్) నివేదికల్లోనూ హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ తారాస్థాయిలో ఉందని వెల్లడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీ-హబ్‌కు సమీపంలో ఒక రియల్టీ కంపెనీ 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆఫీస్ స్పేస్ అతి తక్కువ సమయంలోనే భర్తీ కావడం మరో విశేషం. అందుకే అనేక రియల్టీ కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ నిర్మాణం వైపు పరుగులు తీస్తున్నాయిప్పుడు.