Dr. Reddy’s | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ఏజీ.. భారత్‌లో తన వ్యాపారాన్ని పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్నది. దీంతో ఇక్కడి సంస్థలో మెజార్టీ వాటాను విక్రయించడానికి సిద్ధమైంది. నోవార్టిస్ ఇండియాలో తనకున్న 70.68 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన మరుక్షణమే దేశీయ సంస్థలు ఈ వాటాను చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి చూపగా.. తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాదీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ రేస్‌లోకి వచ్చింది.
నోవార్టిస్‌కు చెందిన దేశీయ వ్యాపారాన్ని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు రెడ్డీస్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపారు. ఔషధాల పరిధిని మరింత విస్తరించడానికి, ప్రీమియం సెగ్మెంట్ వాటాను పెంచుకోవాలనే ఉద్దేశంతో సంస్థ ఉన్నది. నోవార్టిస్‌కు భారత్‌లో 8,100 మంది ఉద్యోగులు ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.378.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారత్‌లో నోవార్టిస్ గ్రూపు..నోవార్టిస్ ఇండియా లిమిటెడ్, నోవార్టిస్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీసులు అందిస్తున్నది.