Hurun List | రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వరుసగా నాలుగో ఏడాది భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. కంపెనీ రూ.17.5లక్షల కోట్లతో బర్గండి ప్రైవేట్, హురున్ ఇండియా-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ కంపెనీ రూ.16.1లక్షల కోట్లతో రెండోస్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.14.2లక్షల కోట్లతో మూడోస్థానంలో ఉన్నది. రిలయన్స్ వాల్యుయేషన్ ఏడాదిలో 12శాతం పెరగ్గా.. టీసీఎస్ వాల్యుయేషన్ 30శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 26శాతం పెరిగింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాల్యుయేషన్ పరంగా అత్యధికంగా లాభపడింది. సంవత్సరంలో విలువ 297శాతం పెరిగింది. అలాగే, ఐనాక్స్ విండ్, జెప్టో వాల్యుయేషన్ సైతం దాదాపు మూడు రెట్లు పెరిగాయి.
భారతీయ ఎయిర్టెల్ రెండుస్థానాలు ఎగబాకి.. తొలిసారిగా తొలి ఐదుస్థానంలోకి దూసుకెళ్లింది. కంపెనీ విలువ 75శాతం పెరిగి.. రూ.9.74లక్షల కోట్లకు చేరింది. మరో వైపు ఐవోపీకి సన్నాహాలు చేస్తున్న ఎన్ఎస్ఈ సంస్థ విలువ రూ.4.7లక్షల కోట్లతో అన్‌లిస్టెడ్ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్నది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జోహో, జెరోధా, మేఘా ఇంజినీరింగ్, పార్లే ప్రొడక్ట్స్, ఇంటాస్ ఫార్మా, డ్రీమ్ 11, రేజర్ పే, అమాల్గమేషన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 బర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 కంపెనీల మొత్తం విలువ రూ.324 లక్షల కోట్లు (సుమారు3.8 ట్రిలియన్ డాలర్లు). ఇది భారత్, యూఏఈ, ఇండోనేషియా, స్పెయిన్ ఆర్థిక వ్యవస్థల మొత్తం జీడీపీ కంటే ఎక్కువ. టాప్ 10 కంపెనీల మొత్తం విలువ సౌదీ అరేబియా జీడీపీ కంటే ఎక్కువకావడం గమనార్హం.