న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశీయ సేవా రంగ కార్యకలాపాలు గత నెలలో దారుణంగా పడిపోయాయి. సెప్టెంబర్లో 10 నెలల కనిష్ఠానికి దిగజారినట్టు శుక్రవారం విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ నెలవారీ సర్వేలో తేలింది. ఆగస్టులో ఈ సూచీ 60.9గా ఉంటే.. సెప్టెంబర్లో 57.7కే పరిమితమైంది. గత ఏడాది నవంబర్ తర్వాత ఈ స్థాయిలో గణాంకాలు పతనం కావడం ఇదే తొలిసారి.
నీరసించిన వ్యాపారం, అమ్మకాలు
గత నెల కొత్తగా జరిగే వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పట్టాయని, అంతర్జాతీయ అమ్మకాలు సైతం పడిపోయాయని, ఉత్పాదకత కూడా క్షీణించిందని ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)లో స్పష్టమైంది. అందుకే ఈ ఏడాదిలో మొదటిసారి 60 కంటే తక్కువకు స్కోర్ దిగజారినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ప్రంజుల్ భండారి చెప్పారు. కాగా, మార్కెట్లో తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిళ్లు, వినియోగదారుల ప్రాధాన్యతలో మార్పులు వంటివి ఇండెక్స్ వృద్ధిలో పతనానికి కారణమైనట్టు ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రమాదంలో తయారీ రంగం
పీఎంఐ తాజా గణాంకాలు భారతీయ తయారీ రంగంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దేశంలోకి పెరుగుతున్న దిగుమతుల కారణంగా ఇప్పటికే స్థానికంగా ఉత్పాదకత పడిపోతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’తో ఒనగూరిందేమీ లేదని ఇటీవల విడుదలైన గణాంకాలే తేల్చాయి. ఈ క్రమంలో దిగుమతుల్ని తగ్గించి, ఎగుమతుల్ని పెంచే దిశగా అడుగులు పడకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే
పొరుగు దేశం చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటుపైనా ఇండస్ట్రీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ మార్కెట్లో చైనా కంపెనీల వ్యాపార కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తుండటం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రధాన ముప్పుగా వారు అభివర్ణిస్తున్నారు. కొన్ని రంగాల్లోకి చైనా కంపెనీల రాకను అడ్డుకుంటున్నప్పటికీ.. ఇతర మార్గాల ద్వారా అక్కడి మూలాలున్న సంస్థలు భారత్లోకి ప్రవేశిస్తూనే ఉండటం ఆందోళనకరంగా తయారైంది. దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా సంస్థలదే హవా అన్న విషయం తెలిసిందే. గృహోపకరణాలు, ఇతర డిజిటల్ పరికరాలు, ఆటో రంగంలోనూ ఆ దేశ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో దేశీయంగా తయారీ బలపడేలా మోదీ సర్కారు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని, ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తే త్వరితగతిన మెరుగైన ఫలితాలను సాధించవచ్చనీ మెజారిటీ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత మందగనం వేళ ఇది చాలా అవసరమని అంటున్నారు.