ఈ రోజుల్లో పిల్లలు చాలాచాలా చురుగ్గా ఉంటున్నారు. హింటిస్తే చాలు అల్లుకుపోతున్నారు. ప్రతీ విషయంలో తెలివిగా ఆలోచించి నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కాస్త ఓపిగ్గా చెబితే ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవాటవుతుంది. మరి పసితనంలోనే పొదుపు పాఠాలు నేర్పుతారా! నిపుణుల సలహాలేమిటి?
Financial Discipline | ప్రతీ మనిషి తన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. అది చిన్నతనం నుంచే అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. నిజానికి ఇది ఒకప్పటితో పోల్చితే ఇప్పటి తరాలకు నేర్పడం సులభమనే చెప్పవచ్చు. టెక్నాలజీపరంగా కూడా నేటి పిల్లలు ఎంతో ముందుంటున్నారు. వారికి నచ్చినవిధంగా మనం చెప్పగలిగితే వారి నుంచి అద్భుతాలనే ఆశించవచ్చంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కానీ మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలు.. ఆటలు, చదువు, ఇతరత్రా రంగాల్లోనే రాటుదేలాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే శిక్షణను కూడా ఇప్పిస్తున్నారు. అయితే ఇవన్నీ అవసరమైనవే అయినా.. మనీ మేనేజ్మెంట్ కూడా చాలాచాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వివేకవంతమైన నిర్ణయాల్లో ఆర్థిక క్రమశిక్షణ కీలకపాత్ర పోషిస్తుందని గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ విధంగా ముందుకెళ్లాలంటూ సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు పొదుపు విలువను తెలియజేస్తూ పెంచాలి. అప్పుడే బాధ్యతలనేవి తెలిసొస్తాయి. ప్రతి నెలా పిల్లలకు రూ.10 లేదా రూ.20 ఇస్తూ వెళ్లండి. ఇచ్చేటప్పుడే ఆ డబ్బును దాచుకుంటే రేపు వాళ్ల అవసరాలను దానితో ఎలా తీర్చుకోవచ్చో వివరించండి. ఒకవేళ మీకు అవసరమైతే ఆ నగదును అడిగి తీసుకుని, మళ్లీ తిరిగిచ్చేటప్పుడు అదనంగా ఇంకాస్త ఇవ్వండి. దీంతో సంపాదన అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఇలా ఒక ఏడాదిపాటు ఆ పైసలను ఖర్చు చేయకుండా దాచుకోవాలని చెప్పి, అందుకు మద్దతుగా నిలవండి. అప్పుడు ఒక్కసారిగా పోగయ్యే ఆ సొమ్ముతో వారికి అవసరమైనవి కొనివ్వండి. ఇలా మీరే కాదు.. ఇంట్లోని పెద్దవాళ్లు ఎవరిచ్చినా అలాగే దాచుకునేలా అలవాటు చేస్తే మంచి ఫలితాల్నే చూడవచ్చు.
ఆర్థిక క్రమశిక్షణలో పొదుపు ఎలాంటి పాత్ర పోషిస్తుందో.. ఖర్చులూ అలాంటి భూమికనే వహిస్తాయి. అందుకే అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియజెప్పాలి. వినకపోతే నచ్చజెప్పాలేగానీ.. తిట్టి, కొట్టి వారిని దారికి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుందన్నది మరువద్దు. ఎందుకంటే ఇలాచేస్తే పిల్లలు మొండిగా తయారవుతారు. ఆహారం, పుస్తకాలు అవసరమైనవని.. బొమ్మలు, చిరుతిళ్లు అనవసరమైనవని చెప్పాలి. ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలతో ఓ గేమ్‌ను లేదా స్కూల్ షూస్ కొనవచ్చని చెప్పి, దేనికెంత ప్రాధాన్యమో తెలియపర్చండి. అనవసరంగా, వృథాగా ఖర్చుచేస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రాక్టికల్‌గా తెలియజేయండి. చెబితే విన్నదాని కంటే చూస్తే నేర్చుకునేదే ఎక్కువ మరి. కనుక ఇంటి ఆర్థిక విషయాల్లో వీలున్నంత మేరకు మీ పిల్లలని భాగస్వాముల్ని చేయండి.
ఆర్థిక లక్ష్యాలు అనేవి చాలా కీలకం. పిల్లలు కోరిన ఓ బొమ్మ కోసమో లేదా మరే ఇతర వస్తువుకైనాసరే దానికయ్యే నగదును ఎలా దాచుకోవాలి, సంపాదించాలన్నదాని కోసం ఓ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఈ లక్ష్య సాధనకు వారి వెన్నంటే ఉంటూ ప్రోత్సహించాలి. ఉదాహరణకు వారికి రూ.1,500 కావాలంటే నెలకు రూ.150 చొప్పున సేవ్ చేసుకునేలా ముందుకు తీసుకెళ్లండి. 10 నెలల్లో రూ.1,500 అందేలా చేస్తే ఆ డబ్బు విలువ, కష్టం, సమయం విలువ కూడా తెలుస్తుంది. పిల్లలో సహనం, ఓపిక పెంపొందించడానికీ ఇది దోహదం చేస్తుంది.
పిల్లలకు చిన్నప్పట్నుంచే పెట్టుబడి ప్రాధాన్యతను, దానికున్న అవకాశాలనూ తెలియపర్చాలి. సేవింగ్స్ అకౌంట్స్ లేదా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) మొదలుపెట్టేలా కృషి చేయాలి. సిప్‌లో నెలకు రూ.500 చొప్పున వారు ఇన్వెస్ట్ చేసేలా సహకరించండి. అలా పెడుతూపోయిన నగదు ఏ రకంగా పెరుగుతుందో కూడా వారికి చూపిస్తూ వివరించండి. ఇలా వారిని ఇన్వెస్ట్మెంట్ వైపు నడిపిస్తే ప్రతీ రూపాయిని వారు మిగుల్చుకుని, దాన్ని సేవింగ్స్‌లోకి, అలా పెట్టుబడి సాధనాల్లోకి తీసుకెళ్లగలరు.
జీవితంలో ఊహించని పరిణామాలెన్నో జరుగుతాయి. అందుకే వాటి గురించి కూడా పిల్లలకు చెప్పాలి. ఆస్తుల ధ్వంసం, దొంగతనాలు, ఉద్యోగం కోల్పోవడం వంటివి ఎదురైతే ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయో వివరించాలి. అందుకే ముందు జాగ్రత్తగా ఎమర్జన్సీ ఫండ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించాలి. అలాగే బీమా ఆవశ్యకతను వివరించాలి. ఆర్థిక ప్రణాళికలో బీమా సైతం ప్రధానమేనని తెలియజెప్పడం ముఖ్యం. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఇలా దేనికదే ముఖ్యమైనది మరి. దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.
పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. కాబట్టి మీరు ఆర్థిక క్రమశిక్షణతో ఉంటేనే మీ పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారన్నది గుర్తుంచుకోవాలి. మీ పొదుపు, మీ పెట్టుబడులు, మీ ఖర్చులన్నీ వారికి తెలిసేలా చేయండి. దీనివల్ల పారదర్శకత కూడా వస్తుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత త్వరగా ప్రారంభిస్తే, ఎంత చిన్న వయసు నుంచే ఆరంభిస్తే అంత లాభాలు ఉంటాయన్నది మరువద్దు.