తల్లిదండ్రులందరూ తమ పిల్లల కోసమే ఆస్తుల్ని కూడబెడతారు. అయితే చాలామంది తమ మరణానంతరం ఆస్తి పంపకాలు ఎలా జరగాలి? అన్నది వివరిస్తూ వీలునామాను రాస్తారు. ఇలాంటప్పుడు ఏ పేచీ ఉండదు. ముఖ్యంగా కుటుంబంలో ఎలాంటి గొడవలకు తావుండదు. వారసులకు ఆస్తుల పంపిణీ దాదాపు సజావుగానే సాగుతుంది. ఇంకొందరు తాము బ్రతికి ఉండగానే ఆస్తుల్ని పిల్లలకు పంచి ఇచ్చి, వారివారి ఇష్టప్రకారం వాళ్ల వద్దే శేష జీవితం గడుపుతూ ఉంటారు.
కానీ కొందరు వీలునామా రాయకుండానే చనిపోతారు. అలాంటప్పుడు ఆస్తుల పంపకాలు ఎలా? కొడుకులు, కూతుళ్లకు ఏ ఆస్తిని ఎలా విభజిస్తారు? అన్నది ప్రశ్న. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కూతుర్లుసహా వారసులందరికీ పెండ్లిళ్లు అయినా, కాకపోయినా తల్లిదండ్రుల స్వార్జితంలో చట్టప్రకారం వాటా ఉంటుంది.