Ratan Tata | ముంబై, అక్టోబర్ 10: ఏమీ తెలియకుండా ఎందుకొచ్చారన్నారు.. ఎగళాళి చేసి, అవమానించి పొమ్మన్నారు.. చివరకు అదే వ్యక్తి చేయూతతో పరువు కాపాడుకున్నారు. టాటా మోటర్స్, ఫోర్డ్ మోటర్స్ మధ్య జరిగిన ఘటనలు.. రతన్ టాటా పట్టుదల, మంచితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
1998లో తన కలల ప్రాజెక్ట్ ‘టాటా ఇండికా’ కారును టాటా మోటర్స్ ద్వారా రతన్ టాటా దేశీయ ఆటో మార్కెట్‌కు పరిచయం చేశారు. భారత్‌లోనే ఇది డీజిల్ ఇంజిన్ కలిగిన తొలి హచ్‌బ్యాక్ మాడల్ కావడం విశేషం. కానీ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఏడాదిలోపే టాటా మోటర్స్ తమ కార్ల వ్యాపారాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నది. ఇందుకు అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ కంపెనీయే సరైనదని భావించింది. ఫోర్డ్ మోటర్స్ నుంచీ అందుకు తగ్గట్టుగానే సంకేతాలొచ్చాయి. ఈ క్రమంలోనే బాంబే హౌజ్‌కు ఫోర్డ్ అధికారులు వచ్చి టాటాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత డీల్ కుదుర్చుకొనేందుకు రతన్ టాటా తన బృందంతో అమెరికాలోని డెట్రాయిట్కు బయలుదేరారు. అక్కడ ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్‌ను కలుసుకొని మాట్లాడారు. కానీ దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఊహించని రీతిలో టాటా టీమ్‌కు అవమానం ఎదురైంది. ‘మీకేమీ తెలియదు. మరెందుకు ప్యాసింజర్ కార్ల తయారీకి దిగారు’ అని ఫోర్డ్ అధికారులు అవమానకరంగా మాట్లాడినట్టు అప్పటి టాటా బృందంలో ఉన్న ఒకరు ఇప్పుడు గుర్తుచేసుకున్నారు. దీంతో ఆ డీల్ విఫలమైంది. వెంటనే భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇలా న్యూయార్క్‌కు విమానంలో వెళ్తున్నప్పుడు రతన్ టాటా అన్ని కొన్ని మాటల్ని ఇప్పటికీ తాను మర్చిపోలేదని చెప్పుకొచ్చారాయన. అప్పుడే రతన్ టాటా.. తమ యూనిట్‌ను అమ్మేది లేదని నిర్ణయించుకున్నారని, దీని అభివృద్ధికి మరింత దృష్టి పెట్టాలని కూడా నిశ్చయించుకున్నారని నాటి బృందంలో ఒకరిగా ఉన్న ప్రవీణ్ కాడ్లే తెలిపారు. ఆ తర్వాత టాటా మోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగం ఎంతటి విజయాల్ని సాధించిందో తెలిసిందే.
2008లో అమెరికాలో చోటుచేసుకున్న భీకర మాంద్యం.. ఫోర్డ్‌ను గట్టి దెబ్బే తీసింది. దీంతో దివాలా అంచున నిలబడింది. అయితే అప్పుడే ఫోర్డ్‌కు టాటా నుంచి ఓ గొప్ప ఆఫర్ వచ్చింది. ఫోర్డ్‌కు చెందిన ప్రఖ్యాత బ్రాండ్లు జాగ్వర్, లాండ్ రోవర్ (జేఎల్ఆర్)లను కొంటామని టాటా మోటర్స్ ముందుకొచ్చింది. 2.3 బిలియన్ డాలర్ల ఈ క్యాష్ డీల్‌తో ఫోర్డ్ తిరిగి నిలబడింది. ఇందుకుగాను నాడు చులకనగా చూసిన ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డే.. తమ పరువును కాపాడినందుకు టాటాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. టాటా గనుక నాడు జేఎల్ఆర్ను కొనకపోతే ఫోర్డ్ చరిత్ర అక్కడితో ముగిసినట్టేనని చెప్పుకోవచ్చు. అలా ఇక్కడ రతన్ టాటాలోని పట్టుదల, మంచితనాన్ని గుర్తించవచ్చు.
టాటా గ్రూప్ విస్తరణలో రతన్ టాటా పాత్రే ప్రధానం. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ గ్రూప్ సంస్థలున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలోనూ ట్రేడ్ అవుతుండగా, మదుపరులకు ఇవి ఆకర్షణీయ లాభాలనే పంచుతుండటం గమనార్హం. గడిచిన ఐదేండ్లలో 1,500 శాతం వరకు రాబడులను అందించాయి మరి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో 6 టాటా కంపెనీలున్నాయి. అవే టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటర్స్, టైటాన్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ట్రెంట్. వీటి విలువ రూ.28 లక్షల కోట్లుగా ఉంటుంది. గత ఐదేండ్లలో టీసీఎస్ 115 శాతం, టాటా మోటర్స్ 700 శాతం, టాటా స్టీల్ 350 శాతం, టైటాన్ 180 శాతం, టాటా కన్జ్యూమర్ 310 శాతం, ట్రెంట్ 1,500 శాతం చొప్పున లాభాల్ని పంచాయి.
రతన్ టాటా మరణంతో దేశం తన దయాగుణ సంపన్న కుమారుల్లో ఒకరిని కోల్పోయినైట్టెంది. భారత్‌ను టాటా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అత్యుత్తమ ప్రపంచాన్ని భారత్‌కు అందించారు.
రతన్ టాటా మరణం నేపథ్యంలో ఆ గ్రూప్ తర్వాతి వారసుడెవరు? అన్న చర్చ తెరపైకి వస్తున్నది. టాటా సవతి తల్లి కుమారుడైన నోయల్ టాటా, మెహెర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ మెహ్లీ మిస్త్రీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. నోయల్ టాటాకే అవకాశాలున్నట్టు అంచనా. గతంలో టాటా నుంచి సైరస్ మిస్త్రీకి గ్రూప్ పగ్గాలు వచ్చినా.. వివాదాల కారణంగా తిరిగి టాటాకే చిక్కాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న ఎన్ చంద్రశేఖర్‌కు దక్కాయి. టాటా గ్రూప్‌లో టాటా సన్స్, టాటా ట్రస్ట్స్లకు ఎక్కువ వాటాలున్నాయి.