బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పెంచడంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ అదే బాట పట్టాయి. దీంతో ముఖ్యంగా దీర్ఘకాల రుణాలు భారంగా మారాయి. ఫలితంగా గృహ రుణగ్రహీతల ఈఎంఐలు మరింత పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. హోం లోన్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి చేర్చింది. ఈ నెల 1 నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది.
సిబిల్ స్కోర్‌పై
రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి రుణాల కోసం వెళ్లే ముందు మీ క్రెడిట్ స్కోర్ ఎంత? అన్నది ఒక్కసారి చూసుకోవడం మంచిది. సిబిల్ స్కోర్ 800లకుపైగా ఉంటే 7.05 శాతం వడ్డీరేటును ఎస్బీఐ వసూలు చేస్తున్నది. 750-799 మధ్య ఉంటే 7.15 శాతం, 700-749 మధ్య ఉంటే 7.25 శాతం వడ్డీరేటును బ్యాంక్ ఆఫర్ చేస్తున్నది. 650-699 మధ్య ఉంటే 7.35 శాతం, 550-649 మధ్య ఉంటే 7.55 శాతం వడ్డీరేటుకు రుణాలు లభిస్తాయి. ఇక సిబిల్ స్కోర్ లేనివారికి 7.25 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది.
ఈఎంఐలు భారం
ఇప్పటికే మీరు గృహ రుణగ్రహీతలైతే వడ్డీరేట్ల పెంపుతో మీ ఈఎంఐలు పెరగనున్నాయి. నెలకు రూ.800ల దగ్గర్నుంచి రూ.1,800ల వరకు అదనపు భారం పడనున్నది. దీర్ఘకాలంలో మీరు చెల్లించే మొత్తాలు లక్షల్లో పెరుగుతాయి. ద్రవ్యోల్బణం అదుపుపై దృష్టి పెట్టిన ఆర్బీఐ.. రాబోయే ద్రవ్యసమీక్షల్లోనూ వడ్డీరేట్లను మరింత పెంచవచ్చన్న అంచనాలు గట్టిగా ఉన్నాయి మరి. అదే జరిగితే ఈఎంఐలు రుణగ్రహీతలపై పెను భారమే మోపనున్నాయి. కరోనా సమయంలో వడ్డీరేట్లు తగ్గడంతో అంతా గృహ రుణాలను తీసుకోగా.. ప్రస్తుత పరిణామం వారందరికీ ఇబ్బందిగానే పరిణమిస్తున్నది.