Housing Sales | దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల పరిధిలో డిసెంబర్ త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఇండ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్లే డిమాండ్ తగ్గిందని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ ప్రాప్ టైగర్ పేర్కొంది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2024-25 డిసెంబర్ త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు 26 శాతం తగ్గి 1,06,038 యూనిట్లకు పడిపోయాయి. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు 1,43,482 యూనిట్లుగా ఉన్నాయని ప్రాప్ టైగర్ వెల్లడించింది. 2023తో పోలిస్తే 2024లో ఇండ్ల విక్రయాలు మాత్రం ఆరుశాతం వృద్ధి చెందాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ-ఎన్సీఆర్ (నొయిడా, గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్), ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ముంబై, నేవీ ముంబై, ఠాణె), పుణె పరిధిలో 2023లో 4,10,791 ఇండ్లు అమ్ముడైతే, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడు పోయాయి.
‘అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పండుగల సీజన్ నేపథ్యంలో ఇండ్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా వేశారం. పలు రీజియన్ల పరిధిలో ఇండ్ల అమ్మకాలతోపాటు కొత్త వెంచర్ల ప్రారంభం కూడా తగ్గుముఖం పట్టింది’అని ప్రాప్ టైగర్ డాట్ కామ్, హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈఓ ధృవ్ అగర్వాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పలు అంతర్జాతీయ పరిణామాలు, ఆస్తులు ప్రత్యేకించి ఇండ్ల ధరలు పెరిగిపోవడంతో ఇటు డెవలపర్లు, అటు ఇండ్ల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి కనబరిచారు. నెమ్మదించిన ఆర్థిక వృద్ధిరేటు, ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే సంకేతాలు లేకపోవడంతో ఇండ్ల కొనుగోలుదారులు ఆచితూచి స్పందిస్తున్నారు.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మాత్రమే అధిక ఇండ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోలిస్తే 2024లో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇండ్ల విక్రయాలు 6528యూనిట్ల నుంచి 9808 యూనిట్లకు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో 31 శాతం తగ్గి 48,553 యూనిట్ల నుంచి 33,617 యూనిట్లకు పరిమితం అయ్యాయి. పుణెలోనూ 31శాతం క్షీణత నమోదైంది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో 18,240 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 23 శాతం క్షీణతతో 13,236 యూనిట్లకు, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 36 శాతం తగ్గి 13,179 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో ఐదు శాతం తగ్గి 4,073 ఇండ్ల విక్రయాలు నమోదైతే, అహ్మదాబాద్లో 34 శాతం పతనమై 15,310 యూనిట్ల నుంచి 10,170 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఇక కోల్కతాలో 4735 యూనిట్ల నుంచి 3715 యూనిట్లకు దిగి వచ్చాయి.