Home Sales | ఇన్పుట్ కాస్ట్ వ్యయంతోపాటు ఇండ్ల ధరలు పెరిగినా సొంతింటి కల సాకారం కోసం ముందుకు వచ్చే వారే ఎక్కువ అవుతున్నారు. 2023తో పోలిస్తే 2024లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల విక్రయాలు 12 శాతం పెరిగి రూ.6.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. ప్రత్యేకంచి లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొంది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.6.73 లక్షల కోట్లకు చేరుకున్నది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గుర్‌గ్రామ్ పరిధిలో 2023లో రూ.64,314 కోట్ల ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు నమోదయ్యాయి.
గుర్‌గ్రామ్ పరిధిలో డీఎల్ఎఫ్, సిగ్నేచర్ గ్లోబల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎం3ఎం ఇండియాతోపాటు స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్, ఎలన్గ్రూప్, ఏటీఎస్ గ్రూప్, కృషుమి కార్పొరేషన్ తదితర సంస్థలు అత్యధికంగా ఇండ్లు విక్రయించాయి. ఓవరాల్‌గా ఢిల్లీతోపాటు దేశ రాజధాని (ఎన్సీఆర్) పరిధిలో 2023లో ఇండ్ల విక్రయాలు 63 శాతం వృద్ధి చెందాయి. 2023లో రూ.94,143 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,53,000 కోట్లకు చేరాయని ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో సగటున ఎస్ఎఫ్టీ ధర రూ.12,469 పెరిగింది.
ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్ అండ్ సీఈఓ సమీర్ జాసుజా మాట్లాడుతూ.. ‘ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ధృడంగా మౌలిక వసతుల అభివృద్ధి, కార్పొరేట్ సంస్థల ప్రాతినిధ్యం పెరుగుదలతో పుష్కల ఉపాధి అవకాశాలు లభించడంతో ఆఫీస్ లీజింగ్‌కు ఆధిపత్యం పెరిగింది’అని చెప్పారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పెరుగుదలకు అవకాశం ఉందన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2023తో పోలిస్తే గతేడాది (2024)లో ఇండ్ల విక్రయాలు 13శాతం వృద్ధి చెందాయి. 2023లో రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1.38 లక్షల కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడు పోయాయి. ఠాణెలో ఆరు శాతం ఇండ్ల విక్రయాలు పెరిగాయి. 2023లో రూ.53 వేల కోట్ల ఇండ్ల అమ్మకాలు జరిగితే, 2024లో రూ.56 వేల కోట్లకు చేరాయి. పుణెలో ఒకశాతం సేల్స్ పతనం అయ్యాయి. నేవీ ముంబైలో ఇండ్ల విక్రయాలు 2023తో పోలిస్తే గతేడాది 32 శాతం వృద్ధి చెందాయి. 2024లో రూ.19 వేల కోట్ల విలువైన అమ్మకాలు రికార్డయితే గతేడాది రూ.25 వేల కోట్లకు దూసుకెళ్లాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇండ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2023లో రూ.1.28 లక్షల కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడైతే గతేడాది రూ.1.05లక్షల కోట్లకు పడిపోయాయి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 2023తో పోలిస్తే ఇండ్ల సేల్స్ 13 శాతం వృద్ధి చెందాయి. 2023లో రూ.75 వేల కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.85,000 కోట్లకు చేరాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఐదు శాతం ఇండ్ల అమ్మకాలు పుంజుకున్నాయి. 2023లో రూ.19 వేల కోట్ల విక్రయాలు నమోదైతే గతేడాది రూ.20 వేల కోట్ల విలువైన ఇండ్ల సేల్స్ రికార్డయ్యాయి.