Savings | ముంబై, సెప్టెంబర్ 3: దేశంలో గృహస్తుల పొదుపు తిరిగి పుంజుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. 2020-21లో కరోనా దెబ్బకు హౌస్‌హోల్డ్ సేవింగ్స్ దారుణంగా పడిపోయాయన్న ఆయన ఇప్పుడు పెరుగుతున్నాయని, రాబోయే దశాబ్దాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు అసలు సిసలైన దన్ను ఈ పొదుపేనని అన్నారు.
మంగళవారం ఇక్కడ సీఐఐ ‘ఫైనాన్సింగ్ 3.0’ పేరిట వికసిత్ భారత్ కోసం నిర్వహించిన సదస్సులో పాత్రా కీలకోపన్యాసం ఇచ్చారు. భారత్‌లో గృహస్తుల పొదుపు చాలా కీలకమని, ఇతర రంగాలకూ వీరి నుంచి పెట్టుబడులు అందుతాయన్నారు. అయితే కరోనా పరిస్థితులతో అంతా తలకిందులైందని, మళ్లీ కోలుకుంటున్న ప్రజలు.. తిరిగి సేవింగ్స్ బాట పట్టారని చెప్పారు. ఇప్పటికే కుటుంబాల నుంచి భౌతిక పొదుపు జీడీపీలో 12 శాతానికి చేరిందని, మున్ముందు మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
2010-11లో నాటి జీడీపీలో 16 శాతంగా ఉన్నట్టు గుర్తుచేశారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక విధానాలను అనుసంధానిస్తూ ఆర్బీఐ చర్యలుండటం, విదేశీ వాణిజ్యం-పెట్టుబడుల ప్రదర్శన బాగుండటం కలిసొస్తున్నదన్నారు. దేశంలో పెరిగే పెట్టుబడుల సామర్థ్యం.. డిజిటల్ ఎకానమీతోపాటు రెన్యువబుల్ ఎనర్జీ, గిడ్డంగులు, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్, డాటా సెంటర్ల వంటి వాటికి లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.