ఆదిలాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో మూతబడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది.. స్థానిక యువత ఉపాధికి, పరిశ్రమ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నది. ఈ సిమెంట్ తయారీ సంస్థ తిరిగి ప్రారంభమైతే 6వేల మందికి ఉపాధి లభించడంతోపాటు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికీ దోహదం చేయగలదు. దీంతో కంపెనీని తిరిగి ప్రారంభించాలంటూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సాధన సమితి సభ్యులు ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమార స్వామిని కలువగా.. ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రితో కేటీఆర్ జరిపిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కొరవడిందన్న సంకేతాలు రావడం గమనార్హం. సీసీఐ ప్రారంభానికి రేవంత్ సర్కార్ చొరవ చూపితే పరిశ్రమ పునరుద్ధరణ సాధ్యమయ్యే అవకాశాలున్నట్టు కూడా స్పష్టమైంది. కేవలం రూ.250 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే సీసీఐని తెరువడం సాధ్యమేనని కేటీఆర్‌తో మంత్రి కుమార స్వామి అన్నట్టు సాధన సమితి సభ్యులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి సమాచారం లేదని మంత్రి పేర్కొన్నట్టు వారు తెలిపారు. నిజానికి ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటనలో సీసీఐని మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కేంద్రం సానుకూలంగా ఉన్నా స్పందించకపోవడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణం శివారులో కేంద్ర ప్రభుత్వం 1982 ఆగస్టు 15న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు అంకురార్పణ చేసింది. 807 ఎకరాల విస్తీర్ణంలో రోజుకు 1,200 టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో ఈ కర్మాగారాన్ని రూ.47 కోట్ల వ్యయంతో నిర్మించింది. 1984 మేలో ఉత్పత్తి ప్రారంభమైంది. కాగా, 772 ఎకరాల్లో ప్లాంట్, దానికి అనుబంధంగా 170 ఎకరాల్లో టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 48 మిలియన్ టన్నుల సున్నపురాయి నిల్వలు, 32కేవీ విద్యుత్తు సరఫరా, నీటి సౌకర్యాలున్నాయి. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల కుటుంబాలు ఉపాధి పొందేవి. ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉండటంతో 1993 వరకు సంస్థ లాభాలను ఆర్జించింది. లెవీ ప్రకారం ఉత్పత్తి అయిన సిమెంట్‌లో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసేవి. అయితే అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానంలో సీసీఐకిచ్చిన ప్రోత్సాహకాలను కేంద్రం ఉపసంహరించుకున్నది. కోల్, జిప్సం, సున్నపురాయి తదితర ముడి సరుకులపై రాయితీని తొలగించింది. లెవీ విధానాన్ని కూడా ఎత్తివేసింది. దీంతో సీసీఐకి క్రమంగా నష్టాలు ప్రారంభమయ్యాయి. 1996నాటికి సీసీఐ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడంతో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపేసింది. ఈ నేపథ్యంలో 2008లో సీసీఐ ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించి పరిశ్రమను పూర్తిగా మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో సీసీఐపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
మూతబడిన సీసీఐని పునఃప్రారంభించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలనే చేసింది. ప్రధాన మంత్రి మోదీకి నాటి సీఎం కేసీఆర్ ఈ మేరకు లేఖలు కూడా రాశారు. అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసి సీసీఐని ప్రారంభించాలనీ కోరారు. తమ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా వివిధ రాయితీలు కల్పిస్తామని కేంద్రానికి సూచించారు. ఈ క్రమంలోనే రామగుండం ఎరువుల కర్మాగారం తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 49:51 లేదా 51:49 నిష్పత్తిలో సంయుక్తంగా పరిశ్రమను నిర్వహించేందుకూ సిద్ధమని నాటి బీఆర్ఎస్ సర్కార్ స్పష్టం చేసింది. చివరకు సీసీఐని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికే అప్పగించినా.. స్వాధీనం చేసుకుని నడుపడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి తెలియజేసింది. అయినా మోదీ సర్కార్ నుంచి స్పందనే కరువైంది. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి సానుకూలత వస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ కనబరుస్తున్నది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు జిల్లా అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.
సీసీఐ పునరుద్ధరణ విషయంలో కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉన్నది. యాజమాన్యం కూడా కంపెనీని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు ఇస్తే మిగతా నిధులను తాము సమకూర్చుకుని పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్తున్నారు. సీసీఐ భూములను రక్షణ శాఖ, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి కూడా అంటున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన, సహకారం లేదు. కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కేంద్ర ప్రభుత్వం అడిగిన రూ. 250 కోట్లను సమకూర్చాలి. అది జరుగకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
– విజ్జగిరి నారాయణ, సీసీఐ సాధన కమిటీ కో-కన్వీనర్