Honda Warranty Plus | ప్రముఖ టూ-వీలర్ల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. తన వాహనాలపై వారంటీ గడువు పొడిగిస్తోంది. ఎక్స్టెండెడ్ వారంటీ ప్లస్ (ఈడబ్ల్యూ ప్లస్) పథకం కింద పదేండ్ల వరకు వారంటీ అందిస్తుంది. 250 సీసీ సెగ్మెంట్ బైక్స్ వరకూ ఈ వారంటీ, ఇతర బెనిఫిట్లు లభిస్తాయి.
ఇందుకోసం తన కస్టమర్లకు హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఫ్లెక్సిబుల్ ఆఫర్ అందిస్తున్నది. తన వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి తొమ్మిదో ఏడాది.. 91 రోజులు ముగిసే లోపు కస్టమర్లు.. ఈడబ్ల్యూ ప్లస్ స్కీం కింద వారంటీ పొడిగించాలని కోరాల్సి ఉంటుంది. అంతే కాదు పదేండ్ల వారంటీ కవరేజీతోపాటు యజమాని మారినా వారంటీ రెన్యూవల్ ఆప్షన్ బదిలీ ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇంజిన్ కాంపొనెంట్లు, ఇతర అత్యవసర మెకానికల్, ఎలక్ట్రికల్ విడి భాగాలకు ఈడబ్ల్యూ ప్లస్ సమగ్ర కవరేజీనిస్తుంది.
ఈ ఎక్స్ టెండెడ్ వారంటీ ప్లస్ (ఈడబ్ల్యూ ప్లస్) పథకం కింద కస్టమర్లకు హోండా మూడు ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు ఇచ్చింది. బైక్ కొనుగోలు చేసిన ఏడో ఏట మూడేండ్ల పాలసీ, ఎనిమిదో ఏటా రెండేండ్లు, తొమ్మిదో ఏటా ఏడాది పాలసీ ఎంచుకోవచ్చు. 1.20 లక్షల కిలోమీటర్లు నడిపిన స్కూటర్లు, 1.30 లక్షల కిలోమీటర్లు నడిపిన మోటారు సైకిళ్లకు కూడా ఈ ఆప్షన్లు వర్తిస్తాయి.
ఈడబ్ల్యూ ప్లస్ పాలసీ కింద 150సీసీ సెగ్మెంట్ బైక్ లు, స్కూటర్లకు రూ.1317, 150-200 సీసీ సెగ్మెంట్ బైక్ లు, స్కూటర్లకు రూ.1667 పే చేయాల్సి ఉంటుంది. సదరు బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసిన ఏడాదిని బట్టి వారంటీ ఎక్స్ టెన్షన్ ఫీజు పెరుగుదల వర్తిస్తుంది. ఏదేనీ హోండా సర్వీస్ సెంటర్లో ఈ పాలసీ కొనుగోలు చేయొచ్చు.