Honda EV Scooter | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల 27న ఆవిష్కరించనున్నది. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) తో కూడిన యాక్టివా, డియో వంటి మోడల్ స్కూటర్లదే ఆధిపత్యం. అయితే, ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఈవీ సెగ్మెంట్ చాలా ప్రారంభ దశలో ఉంది. అక్టోబర్ నెలలో పండుగల సందర్భంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ 1,39,159 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 20,65,095 యూనిట్లు. మొత్తం టూ వీలర్స్ విక్రయాల్లో ఈవీ స్కూటర్ల విక్రయాలు 6.74 శాతం మాత్రమేనని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) పేర్కొంది.
హోండా మోటార్స్ 5,54,249 ఐసీఈ టూ వీలర్స్ విక్రయించింది. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయంలో 26.84 శాతం. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, ఎథేర్ ఎనర్జీ, హీరో మోటో కార్ప్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఎస్1తో ఓలా ఎలక్ట్రిక్, ఐక్యూబ్, ఎక్స్‌తో టీవీఎస్ మోటార్ కంపెనీ, చేతక్ తో బజాజ్ ఆటో, రిజ్టాతో ఎథేర్, విదా వీ1తో హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయిస్తున్నాయి.