Honda – Nissan | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థలు హోండా, నిసాన్ భాగస్వామ్యం దిశగా అడుగులేస్తున్నాయి. ఒక సంస్థ ఫ్యాక్టరీలో మరొక సంస్థ కార్లను ఉత్పత్తి చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నాయని జపాన్ వార్తా సంస్థ క్యోడో శనివారం తెలిపింది. తద్వారా రెండు సంస్థల విలీనం అవకాశం ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా నిస్సాన్ కంపెనీకి తన హైబ్రీడ్ వాహనాలను సరఫరా చేయనున్నదని సమాచారం.
హోండా కార్ల తయారీ సంస్థ జపాన్ లోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. విలీనం జరిగితే హోండా తర్వాత నిస్సాన్ కార్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద మూడో సంస్థగా నిలుస్తుంది. ఏటా టయోటా, ఫోక్స్ వ్యాగన్ కార్ల తయారీ సంస్థలు 74 లక్షల కార్లు విక్రయిస్తున్నాయి. తర్వాతీ స్థానంలో నిసాన్ నిలుస్తుంది. గత మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిలో సహకరించుకోవాలని రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
కానీ, ఇటీవలి కాలంలో నిసాన్ ఆర్థిక, వ్యూహాత్మక సమస్యల్లో చిక్కుకున్నది. నిసాన్, మిత్సుబిషి మోటార్స్ కలిసి తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలని, పరస్పరం సహకారంతో ముందుకెళ్లాలని భావించామని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హోండా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. హోండాతో విలీనంపై స్పందించే విషయమై నిసాన్ నిరాకరించింది. మిత్సుబిషి మోటార్స్ లో నిసాన్ ప్రధాన వాటాదారు. బ్రిటన్ లోని నిసాన్ కార్ల ఫ్యాక్టరీని హోండా ఉపయోగించుకోనున్నదని తెలుస్తున్నది.