సొంతింటి కల సాకారానికి చక్కని మార్గం ఏదని అడిగితే ఎవరైనా గృహ రుణమేనని టక్కున చెప్తారు. అయితే కాస్త తెలివితో.. ఇంకాస్త ధైర్యంతో ఆలోచిస్తే ప్రత్యామ్నాయ దారులూ కనిపించక మానవు. అలాంటి వాటిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఒకటి. మ్యూచువల్ ఫండ్‌లో మీరు సిప్‌ను మొదలు పెట్టినైట్టెతే గృహ రుణ కాలపరిమితిలో సగం సమయానికే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ఒక్కసారి పరిశీలిస్తే.. దినేశ్, సురేశ్ స్నేహితులు. ఇద్దరి వయసూ, సంపాదన ఒక్కటే. ఇద్దరూ సొంతిల్లు కోసం కష్టపడుతున్నారు. అయితే దినేశ్ హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలను ముందుగానే నేరవేర్చుకున్నాడు. కానీ సురేశ్ పెట్టుబడుల వైపు నడిచాడు. ఆ తర్వాత జరిగిందిది..
గృహ రుణంలో..
9 శాతం వార్షిక వడ్డీరేటుకు రూ.80 లక్షల గృహ రుణాన్ని 25 ఏండ్ల కాలపరిమితితో దినేశ్ తీసుకున్నాడు. నెలనెలా ఈఎంఐ రూ.67,136గా ఉన్నది. మొత్తం రుణ కాలపరిమితి 300 నెలల్లో దినేశ్ రూ.2,01,40,800 చెల్లించాల్సి వస్తున్నది. ఇందులో వడ్డీ భారమే రూ.1.2 కోట్లకుపైగా ఉన్నది.
సిప్ ఇన్వెస్ట్మెంట్లో..
ఇదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో అంతే మొత్తాన్ని సురేశ్ పెట్టుబడిగా పెట్టాడు. 12 శాతం వార్షిక వృద్ధిని అందుకున్నాడు. నెలనెలా రూ.67,136 చొప్పున 10 ఏండ్లు మొత్తం రూ.80,56,320ని ఇన్వెస్ట్ చేశాడు. దీనిపై మరో రూ.75,41,996ను అదనంగా పొందాడు.
పదేండ్లకే సురేశ్ దగ్గర రూ.1,55,98,316 ఉన్నది. మరో రెండేండ్లు తన పెట్టుబడిని అలాగే కొనసాగించాడు. అప్పుడు రూ.2.2 కోట్లు చేతికొచ్చింది. పెట్టిన పెట్టుబడి రూ.96,67,584గా ఉన్నది. దానిపై లాభం రూ.1,19,67,138 అందుకున్నాడు. ఇలా దినేశ్‌తో పోల్చితే.. సురేశ్ అందులో సగం కాలవ్యవధి అంటే 12 ఏండ్లకే ఇంటిని చేజిక్కించుకున్నాడు. నచ్చిన ఇంటిని తన దగ్గరున్న సొమ్ముతో కొనేసి రుణ భారం నుంచి తప్పించుకున్నాడు.
నెలనెలా రూ.50 వేలతో..
సిప్‌లో నెలనెలా రూ.50 వేలను పెట్టుబడిగా పెట్టి.. మిగతా మొత్తాన్ని అద్దె ఇంటికి చెల్లించారనుకుందాం. 10 ఏండ్లకు మీ పెట్టుబడులు రూ.60 లక్షలు అవుతాయి. దానిపై రూ.56,16,954 పొందవచ్చు. ఇలా 12 ఏండ్లు పెడితే అదనంగా రూ.89, 12,609 అందుకోవచ్చు. కనుక గృహ రుణం కన్నా.. సిప్ పెట్టుబడులే మిన్న అని చెప్పవచ్చు.
చివరగా..
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయన్న విషయాన్ని మరిచిపోవద్దు. లాభనష్టాలు ఇందులో సహజం. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు సదరు ఫండ్ డాక్యుమెంట్లను పూర్తిగా చదివాకే నిర్ణయం తీసుకోవాలి. అయితే దీర్ఘకాల పెట్టుబడులు కాబట్టి లాభాలకు ఆస్కారం ఎక్కువనే చెప్పవచ్చు. అయినప్పటికీ వ్యక్తిగత రిస్క్‌పైనే ఈ ప్రతిఫలాలు ఆధారపడి ఉంటాయన్నది మరువద్దు. అలాగే గృహ రుణంపై వడ్డీరేట్లలో, సిప్ పెట్టుబడుల్లో రాబడుల్లో ఎక్కువ, తక్కువలూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.