న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన క్రమంలో పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియకు తెరలేపడంతో జూన్‌లో ఐటీ వంటి వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జూన్‌లో వైట్ కలర్ జాబ్ మార్కెట్ 65,000 మందికి పైగా నూతన ఉద్యోగులను నియమించుకోవడంతో మే నెలతో పోలిస్తే జూన్‌లో నియామకాలు 32 శాతం పెరిగాయని సిబ్బంది సేవల సంస్థ ఎక్స్‌ఫెనో డేటా వెల్లడించింది. వైట్ కాలర్ జాబ్ మార్కెట్లో 2.7 లక్షలకు పైగా ఖాళీలున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నియామకాలు ఊపందుకున్నాయని ఆర్థిక వేత్తలు, ఉపాధి నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొవిడ్-19 కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో జాబ్ మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరణకు ఇది సంకేతమని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్ధాపకుడు కమల్ కారంత్ పేర్కొన్నారు. జూన్‌లో నియామకాలు జోరందుకోవడంతో మిగిలిన ఏడాది ఇదే ఊపు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూర్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి టాప్ ఫైవ్ మెట్రో నగరాల్లో నియామకాలు అధికంగా చోటుచేసుకున్నాయని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైరింగ్‌లో సాధారణ స్ధితి నెలకొనేలా కనిపిస్తోందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. ఇక ఆటోమొబైల్స్, పరిశ్రమలు, తయారీ, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాల్లో హైరింగ్ కార్యకలాపాల్లో ఇంకా స్ధబ్ధత నెలకొందని అన్నారు.